చంద్రబాబు బయటకు వచ్చేది ఎప్పుడు? అంతర్మథనంలో తెలుగు తమ్ముళ్లు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చుట్టూ రోజురోజుకు కేసుల ఉచ్చు బిగిసుకుంటోంది. ఆయన పై ఒక కేసుకు తోడుగా మరో కేసు చేరుస్తూ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో చంద్రబాబు అరెస్ట్ మొదలయితే ఇప్పుడు దానికి తోడు మరో మూడు కేసులు చేరాయి. 16 రోజులుగా రాజమండ్రి కారాగారంలో రిమాండ్లో ఉన్న ఆయనను శనివారం సిఐడి అధికారులు కస్టడీకి తీసుకొని జైల్లోనే రెండు రోజులు విచారణ సాగించారు. ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల ప్రశ్నలతో చంద్రబాబును విచారించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని ఆధారాలకు అనుగుణంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

అసలు చంద్రబాబు ఏం చెప్పారు సిఐడి విచారణ బృందం ఏం సమాచారం రాబట్టింది అన్నది పక్కన పెడితే ఇప్పుడు అందరిలోనూ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుత విచారణకు సంబంధించిన వీడియోలు సమాచారాన్ని సీల్డ్ కవర్లో సిఐడి సోమవారం కోర్టుకు అందజేయనుంది. అలాగే రెండు రోజుల విచారణలో చంద్రబాబు నుండి వచ్చిన సమాచారంతో సిఐడికి అనుకున్న ఆధారాలు లభించాయన్నది తేలాలి. చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదని మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి చేసిన అభ్యర్థనను ఏసీబీ కోర్టు మన్నిస్తుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. కస్టడీ వరకు రాదని తెలుగుదేశం పార్టీ వర్గాలంతా భావించిన స్కిల్ కేసులో చంద్రబాబు రెండు రోజులు సిఐడి విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఈ కేసుల తర్వాత ఏం జరుగుతుందోనని ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ కేసులో వాస్తవాలు పక్కన పెడితే ఈ వయసులో చంద్రబాబు కేసుల్లో రిమాండ్ వరకు రావడానికి ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వరుస కేసులతో ఆయన బయటకు వచ్చేది ఎప్పుడనే చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది.

అయితే బాబు పై పెట్టేవన్నీ కక్ష పూరిత కేసులేనని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా అవి వాస్తవమే అంటూ వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుండి ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ఉన్న న్యాయ విభాగం బలాలను బేరీజు వేస్తే ఇన్ని రోజులు రిమాండ్లో ఉంటారని ఎవరు అంచనా వేయలేదు. ఒకటి రెండు రోజుల్లో బాబు బయటకు వస్తారని ఆశించారు. కొందరైతే ఈ విషయంలో బెట్టింగ్లు కూడా వేసుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్ది పరిస్థితి మారిపోయింది. బాబుకు విధించిన రెండ్రోజుల రిమాండ్ పూర్తి కాగా, కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. తాజాగా అక్టోబర్ 5వ తేదీ వరకు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రెండు రోజులు సిఐడి కస్టడీ ఆదివారం సాయంత్రం పూర్తయింది. మరోసారి కస్టడీ కోసం సిఐడి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

రాజకీయ చతురత కలిగిన సీనియర్ నేతగా పేరున్న చంద్రబాబుకు ఇప్పుడు అంతా ప్రతికూల వాతావరణమే కనిపిస్తుంది. అరెస్టు సమయం నుండి కోర్టులో ఈయనకు అన్నీ ప్రతికూల తీర్పులే వస్తున్నాయి. ఎన్నికల వరకు చంద్రబాబు బయటికి వస్తారా రారా అని ఆ పార్టీ శ్రేణులు కలవరానికి గురవడం ప్రస్తుతం ఏపీలో కనిపిస్తుంది.

