కృష్ణాష్టమి ఎప్పుడు – ఏ పద్దతిలో జరుపుకోవాలి
శ్రీకృష్ణుని జన్మదినం మనందరకూ పర్వదినం. అదే జన్మాష్టమి అని, కృష్ణాష్టమి అని రకరకాల పేర్లతో పిలుచుకుంటాము. ఆశ్రీకృష్ణపరమాత్ముని జన్మాష్టమి రోజున పూజిస్తే, మన కష్టాలను తొలగించి, సుఖసంతోషాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. పిల్లలూ, పెద్దలూ అందరూ ఆసక్తిగా, సంతోషంతో జరుపుకొనే పండుగ ఈ కృష్ణాష్టమి. ఆరోజున తమ బుజ్జిబుజ్జి పిల్లలకు చిన్నికృష్ణుని వేషాన్ని వేసి, మురిసిపోని తల్లిదండ్రులు ఉండరు. మరి ఈ పండుగను ఈ సంవత్సరం ఏరోజు జరుపుకోవాలనే సందిగ్ధం చాలామందిలో ఉంది.

శ్రీకృష్ణుని జన్మదినం శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. సాధారణంగా కృష్ణాష్టమి ఆరోజున జరుపుకోవాలి. ఈ సారి రాఖీ పండుగకు కూడా ఇదే కన్ఫూజన్‌లో పడ్డాము. ఎందుకంటే కొన్నిసార్లు తిథులు తగులు, మిగులు వస్తుంటాయి. అలా ఈసారి అష్టమి ఆగస్టు18 వ తేదీ రాత్రి 12.16 నిముషాలకు వస్తుంది. 19 వ తేదీ అర్థరాత్రి 1.04 నిముషాల వరకూ ఉంది. అంటే 19 వ తేదీ శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. కాబట్టి పంచాంగం ప్రకారం జన్మాష్టమి శుక్రవారం జరుపుకోవాలని ఉంది. అయితే గురువారం రాత్రే చేసుకోవాలని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే కృష్ణుడు అర్థరాత్రి జన్మించాడు కాబట్టి అదేరోజు జరుపుకోవాలని వారి వాదన. అయితే హిందువుల పండుగలలో చాలావరకూ సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ పండుగను ఉత్తరాదివారు గోకులాష్టమి అనికూడా అంటారు. ఎందుకంటే చిన్నప్పుడు కన్నయ్య గోకులంలో పెరిగాడు కదా. ఆయన పుట్టిన ఈ పర్వదినాన ఒంటిపూట భోజనం చేసి, కృష్ణదేవాలయాలు దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని పురాణాలు చెపుతున్నాయి. ప్రపంచానికి భగవద్గీతను ప్రసాదించిన ఆ పరమాత్ముని నామస్మరణ చాలా ముఖ్యం. ఈరోజున భాగవతం, భగవద్గీత ఎంతో కొంత పఠిస్తే సకల పాపాలు తొలగి పుణ్యలోకం ప్రాప్తిస్తుంది. కొందరు కృష్ణాష్టమికి ఉపవాస దీక్ష చేసి, రాత్రంతా కృష్ణుడిని ధ్యానించి, మర్నాడు ఉదయం వైష్ణవాలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ISKON TEMPLESలో అతి వైభవంగా కృష్ణాష్టమి పండుగను జరుపుతారు. మరి ఈ వెన్నదొంగ పుట్టినరోజు పండుగ మనమూ ఉత్సాహంగా జరుపుకుందామా..