NationalNews

క్షమాపణలు చెప్పిన వాట్సప్

టెక్నికల్ సమస్యలతో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు వాట్సప్ సేవలు స్తంభించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు వాట్సప్ క్షమాపణలు చెప్పింది. సర్వర్ వైఫల్యం కారణంగా పంపిస్తున్న సందేశాలు వెళ్లలేదంటూ కస్టమర్లు… సోషల్ మీడియా వేదికపై సెటైర్లు వేశారు. అయితే తొలుత సమస్య తీవ్రతను గుర్తించని వాట్సప్.. ఆ తర్వాత సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. మేసేజింగ్ సర్వీస్ వాట్సాప్ దాదాపు రెండు గంటలపాటు ఆగిపోయినప్పటికీ అప్పటి వరకు మేసేజ్‌లను బ్యాకప్ చేసినట్టుగా ప్రకటించింది. తాజాగా ఎదురైన సమస్య… గతంలో ఎన్నడూ లేనంత సుదీర్ఘమైనదిగా పేర్కొంది. ఇండియాతోపాటు, పలుదేశాల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో పని చేయడం మానేసింది. పునరుద్ధరణ మధ్యాహ్నం 2.15 గంటలకు జరిగింది. వాట్సప్ అందుబాటులోకి వచ్చినప్పటికీ వినియోగదారులకు కొన్ని సమస్యలు తలెత్తాయ్. ఐతే కొద్దిసేపటికి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించినట్టుగా వాట్సప్ పేర్కొంది. ఐతే మొత్తం వ్యవహారంపై వాట్సప్ స్పందించింది. ఈరోజు వాట్సాప్‌లో సందేశాలు పంపడంలో వ్యక్తులు ఇబ్బంది పడ్డారని దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. ఐతే సమస్యను పరిష్కరించామని… అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. వాట్సప్‌లో సమస్యను మధ్యాహ్నం 12.07 గంటలకు గుర్తించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బ్లాక్ అయ్యింది.