పూరీ రత్నభాండాగారంలో ఏముంది? లేజర్ స్కానింగ్‌లో ఏం తేలింది?
మరోసారి పూరీ రత్నభాండాగారం తెరుచుకుంది. పరిశోధనల నిమిత్తం దీనిని తెరిచారు. బుధవారం పూరీ రత్నభాండాగారంపై తొలివిడత పరిశోధన జరిగింది. కేంద్ర పురావస్తు శాఖ సహాయ డీజీ జాహ్నవి శర్మ నాయకత్వంలో హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త ఆచార్య ఆనంద్‌పాండే బృందంలోని 15 మంది నిపుణులు రహస్యగదులను సందర్శించారు. వాటికి లేజర్ స్కానింగ్ నిర్వహించారు. పూరీ రత్నబాంఢాగారం రహస్యగదుల్లో సొరంగమార్గాలున్నాయా, మరిన్ని గదులున్నాయా సంపదను దాచారా అనే విషయాలపై అధ్యయనం జరిగిందని వెల్లడించారు. తర్వాతి దశలో ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు అత్యాధునిక రాడార్, ప్రత్యేక యంత్రాలతో సొరంగమార్గాల గురించి అధ్యయనాలు, అన్వేషణలు చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అనంతరం భాండాగారం మరమ్మతులు జరుగుతాయని పేర్కొన్నారు. రహస్యగదుల శోధనను తొందరలో పూర్తి చేసి, మరమ్మతులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియనంతా వీడియో తీసామని, దీనిని ప్రభుత్వానికి అప్పగిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సంపదను సురక్షిత ప్రాంతానికి తరలించామని, మరమ్మతులు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయంలోని రహస్యగదుల్లో ప్రవేశపెట్టాలన్నారు. దేవాలయ ఆంతరంగిక విషయాలను మీడియాకు తెలియజేయలేమని పేర్కొన్నారు.


 
							 
							