‘రేవంత్ రెడ్డి చెప్పేందేం నడవదు, నేనే సీనియర్’ అన్న కోమటిరెడ్డి
‘రేవంత్ రెడ్డి చెప్పేందేం నడవదు, నేనే సీనియర్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి. తెలంగాణకు 24 గంటలు కరెంటు అవసరం లేదు, 3 గంటలు రైతులకు కరెంటు ఇస్తే సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికాలోని తానా సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సొంతపార్టీ నేతలే భగ్గుమంటున్నారు. తాజాగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పేందేమీ వేదం కాదన్నారు. ఆయన కంటే అధిష్టానం ఎక్కువన్నారు. రేవంత్ చెప్పేందేం ఇక్కడ నడవదన్నారు. ఇదేమీ రేవంత్ సొంతపార్టీ కాదన్నారు. తామందరూ సీనియర్లమని, రేవంత్ కేవలం ఎన్నికల క్యాంపెయినర్ మాత్రమేన్నారు. మీడియావారు, బీఆర్‌ఎస్ పార్టీ వారు రేవంత్ వ్యాఖ్యలకు వక్రభాష్యాలివ్వడం మానుకోమన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు రైతుల సంక్షేమం పట్టదని, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు తొందరపడి వ్యాఖ్యానాలు చేయొద్దని, కాంగ్రెస్ మేనిఫెస్టోను చూడమని కోమటి రెడ్డి పేర్కొన్నారు.

