NewsTelangana

మోదీకి ఇంకా ఏం కావాలి

వందల కోట్ల అక్రమ డబ్బుతో సంతలో సరకుల్లా ఎమ్మెల్యేలను కొనడం ఎందుకని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్‌ అడిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం చండూరు సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రధాన మంత్రి పదవి కంటే పెద్ద పదవి లేదు కదా.. ఇంకా ఏం కావాలని మోదీని అడుగుతున్నా. ప్రధాని అండ లేకుండా ఇప్పుడు చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు ఇంత కథ నడిపించారా. దీన్ని ప్రేక్షకుల్లా చూడొద్దు. మౌనంగా ఉంటే.. అదే మనకు శాపంగా మారుతుంది. ప్రతి యువకుడు, ప్రతి మేధావి, కవులు, రచయితలు, అక్కచెల్లెళ్లు, ప్రతి ఆడపడుచు దీని గురించి ఆలోచించాలి. దేనికో ఆశపడి.. ఎవడో చెప్పిండని.. మాయమాటలకు లొంగిపోయి ఓట్లేస్తే కష్టాలు తప్పవు. ఓటేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డి వేసి.. ఆవులకు పాలు పిండితే పాలు రావు. గడ్డి గాడిదకు వేస్తున్నామా.. ఆవుకు వేస్తున్నామా.. అని చూసి వేయాలి’ అని కేసీఆర్‌ సూచించారు.