BusinessHome Page Slider

ఇంటి నిర్మాణానికి ఎలాంటి సిమెంట్ వాడాలి?

సొంతిల్లు ఉండాలని ప్రతి మనిషికి ఓ కోరిక ఉంటుంది. ఆ ఇంటి నిర్మాణం కూడా నాణ్యతగా ఉండాలని కోరుకుంటాడు. ఆ ఇంటి నిర్మాణం కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేస్తాడు. ఆ డబ్బు వృధా కాకుండా చూసుకుంటాడు. ఇంటి నిర్మాణంలో సిమెంటు పాత్ర ఎంతో కీలకమైనది. పునాదుల నుంచి ప్లాస్టరింగ్ దాకా సిమెంటును వాడాల్సిందే. మన ఇల్లు పటిష్ఠంగా ఉండాలంటే సిమెంటు ఎంపికలో జాగ్రత్త పడాలి. రేటు విషయంలో రాజీ పడితే.. ఇంటి పటిష్ఠత ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే సిమెంట్ కొనేముందు పలు అంశాలపై దృష్టి సారించాలి. మంచి రకం సిమెంట్ ను ఎలా గుర్తు పట్టాలి? అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బస్తాలోని సిమెంటు మొత్తం ఒకే రంగులో ఉండాలి. సిమెంటు బస్తాలో చేయి పెడితే చల్లగా అనిపించాలి. వెచ్చగా ఉండకూడదు. బస్తాలో ఎలాంటి గడ్డలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా.. అవి చేతితో నలిపితే పొడి కావాలి. ఒక బకెట్ నీళ్లు తీసుకుని అందులో సిమెంటు వేయండి. వెంటనే మునగకుండా కొద్దిసేపు తేలితే అది మంచి రకం అని చెప్పొచ్చు. లేకపోతే అది నాసిరకమని.. బూడిద ఉందని అర్థం చేసుకోవాలి. సిమెంటు నాణ్యతను పరిశీలించడానికి మరో చిట్కా ఏమిటంటే.. వంద గ్రాముల సిమెంట్ ను తీసుకుని.. అందులో నీరు కలిపి సబ్బు బిళ్లలా తయారు చేయాలి. బకెట్ నీటిలో 24 గంటల ఉంచిన తర్వాత బయటికి తీస్తే.. ఆకారంలో ఎలాంటి మార్పు రాకూడదు. కొద్దిగా గట్టి పడితే.. అది మన్నికైనదని అర్థం.