కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి వెనుక అసలు కథేంటి..!?
దాచేస్తే దాగునా… నెవర్.. రాజకీయాలు అసలే దాగవు. ఎంపీపై దాడి జరిగితే సానుభూతి ఎవరికి వస్తుంది? సదరు వ్యక్తికే కదా? ఈ ఘటన రాజకీయంగా అధికార పార్టీకి మైలేజ్ తెస్తోందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి కీడు చేస్తుందా? ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన గటాని రాజుకు అంత అవసరం ఎందుకొచ్చింది? ఆయన నేపథ్యమేంటి? బీఆర్ఎస్ నేతలు చెబుతోందేంటి? ఎమ్మెల్యే రఘునందన్ చెప్తోందేంటి? అన్నదానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన తెలంగాణ అంతటా సంచలనం సృష్టించింది. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తోండటం, ఆయనపై హత్యాయత్నం ఘటన జరగడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. అధికార పార్టీ నేతను చంపే అంత అవసరం సదరు వ్యక్తి ఎందుకు వచ్చిందా అన్న చర్చ మొదలైంది. సానుభూతి రాజకీయాలకు సంబంధం ఉందా, లేదంటే ప్రణాళిక ప్రకారం జరిగిందా అన్న మీమాంశ కూడా ఉంది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇలాంటి దాడి ట్విస్ట్ ఎందుకు జరిగిందన్నదానిపై ఎంతో యాంబిగ్విటీ నెలకొంది. కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదరహితుడు. పెద్దగా ఆయనకు శత్రువులు ఉండే అవకాశం కూడా లేదు. వాస్తవానికి ఎంపీగా గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తరుణంలో ఎలాంటి ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.

ఎన్నికలు మరో నెల రోజులకు రావడంతో ఇప్పుడే దాడి ఎందుకు జరిగిందన్నదానిపై ఉత్కంఠ రేగుతోంది. ఇలాంటి ఘటనలను ఎవరు స్వాగతించరు. ప్రజాస్వామ్యంలో హింసకు తావే లేదు. కానీ ఇలాంటి ఘటనలు రాజకీయంగా కలకలం రేపుతూనే ఉంటాయి. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన గటాని రాజు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీఆర్ఎస్ నాయకులు సైతం దీనిపై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసింది కాంగ్రెస్ గూండా అని… రాహుల్ గాంధీకి ఇంతకంటే రుజువులు కావాలా? అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీంతో మొత్తంగా ప్రభాకర్ రెడ్డి ఘటన రాజకీయ రంగు పులుపుకుంటోంది.

అసలు గటాని రాజు ఎవరు? ఎంపీపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదానిపై ఇప్పుడు ఎంతో చర్చ నడుస్తోంది. గటాని రాజు కాంగ్రెస్ నాయకుడని అటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చెబుతుంటే.. మరోవైపు ఆయన ఇటీవల బీజేపీలో చేరారంటూ కూడా కథనాలొస్తున్నాయ్. అయితే ఇటీవల గటాని రాజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.ఐతే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఆయన దాడి ఎందుకు చేశారన్నదానిపై మాత్రం క్లారిటీ మిస్సవుతోంది. ఆయన దళితుడని, దళితబంధు రాలేదన్న ఆవేదన ఉందని చెబుతున్నారు. వాస్తవానికి గటాని రాజు యూట్యూబ్ చానెల్ నడుపుతున్నారంటున్నా.. ప్రస్తుతం ఆయన ఆ యాక్టివిటీస్ ఏమీ కూడా చేయడం లేదని తెలుస్తోంది. తాను మీడియా పర్సన్ అని చెప్పుకొని పబ్బం గడుపుకుంటాడని తెలుస్తోంది.

మొత్తం వ్యవహారంపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పందించారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన, రాజకీయంగా బురదజల్లొద్దన్నారు. రాజు ఫేస్ బుక్ ఖాతా చూస్తే అతను కాంగ్రెస్ వ్యక్తి అని తేలుస్తుందన్నారు. ప్రభుత్వ తీరుతో నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలకు బెదిరిస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా దుబ్బాకలో గెలిచేది తానేనన్నారు. దాడిని ఎవరూ హర్షించరు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటుండదు. దాడి ఘటనలో పాత్రధారులను, సూత్రధారులను పోలీసులు పట్టుకోవాలి. కేసు విచారించి దోషులకు శిక్ష పడేలా చేయాలి. అప్పుడే ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదు.