హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీపై ఫాక్స్ కాన్ ఛైర్మన్ ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో మీ విజన్ అద్భుతంగా ఉందంటూ యాంగ్ లియూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని తెలిపారు. అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్ (kathy yang), సంస్థ భారత దేశ ప్రతినిధి వీ లీ (V Lee) నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని ఆయన చెప్పారు.
ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మద్దతు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూకి హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఛైర్మన్ యాంగ్ లియూకి వివరించారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు.