టీఆర్ఎస్ శ్రేణులు దిగజారి వ్యవహరిస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు
బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం టీఆర్ఎస్ పతనానికి నాంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మునుగోడులో సమాధి కట్టి టీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆక్షేపించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దిగజారి వ్యవహరిస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు.ప్లోరోసిస్ పేరుతో టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారని మునుగోడు ప్రజలు టీఆర్ఎస్కు సమాధి కడతారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. జేపీ నడ్డాకు సమాధి కట్టడంపై కేసీఆర్, కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

