Andhra PradeshHome Page Slider

టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ కాకుండా ఇంకేమున్నాయో తెలుసా?

టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో బీజేపీకి సంబంధం లేకుండా టీడీపీ-జనసేన కాంబినేషన్‌లో ఒక రేంజ్‌లో పథకాల ప్రకటన చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోండటంతో వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా, తాజాగా కూటమి మేనిఫెస్టో సైతం విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలు తెచ్చామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మేనిఫెస్టో అమలుకు బీజేపీ సహకారం తప్పక ఉంటుందన్నారు. అయితే మేనిఫెస్టోలో ఎక్కడా కూడా బీజేపీ నాయకుల ఫోటోలుగానీ, బీజేపీ పార్టీ సింబల్ గానీ లేకపోవడం విశేషం. సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని విధ్వంసం చేశారన్న చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తోందని, విధ్వంస పాలనను సాగనంపడమే లక్ష్యమని ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు.

టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6
యువతకు 20 లక్షల ఉద్యోగాలు/నెలకు 3 వేల నిరుద్యోగ భృతి
స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15 వేలు
ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు ఆర్థిక సాయం
19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 59 ఏళ్ల వయసు వరకు రూ. 1500
ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మేనిఫెస్టో పూర్తి వివరాలు పీడీఎఫ్ రూపంలో వీక్షించగలరు.