Andhra PradeshHome Page Slider

తెలంగాణలో టీడీపీ, ప్రణాళిక వెనుక చంద్రబాబు వ్యూహమేంటంటే..!?

జూలై 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నుండి వెలువడిన రాజకీయ చిత్రాలు రెండు స్పష్టమైన సందేశాలను పంపాయి. ఒకటి, రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు, విభేదాలను తొలగించేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని ప్రారంభించేందుకు చంద్రబాబు పరోక్షంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పునరాగమనం చేయడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొనసాగించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించడం ద్వారా చంద్రబాబులో మునుపెన్నడూ లేని కాన్ఫిడెన్స్ కన్పిస్తోంది. జులై 6న హైదరాబాద్‌లో రెండు రోజులపాటు బస చేసిన సందర్భంగా కార్యకర్తలతో, మరికొందరు ముఖ్య నేతలతో చర్చల సందర్భంగా తెలంగాణలో పార్టీని పునరుద్ధరించడంపై చర్చించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

గతం గతః అని రాజకీయాల్లో ఊరకే అనరు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. అందుకు అనేక కారణాలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రాత్మక విజయంతో తెలంగాణపై చంద్రబాబు దృష్టి కోణంలో మార్పు వస్తోంది. పార్టీని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ‘ఆంధ్రాపార్టీ’ అంటూ విమర్శలతో వెనక్కి తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని టీడీపీ 3.5 శాతం ఓట్లతో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అప్పట్లో కేవలం 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. టీడీపీ పునరాగమనం అంటే రెండు ప్రాంతీయ పార్టీల పోరాటంలో త్రిముఖ పోరులో కాంగ్రెస్‌కే లాభం చేకూరుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి మాజీ టీడీపీ నాయకుడే కాదు, అప్పట్లో బీఆర్‌ఎస్‌లో అధికార పీఠాన్ని ఆస్వాదించిన పలువురు టీడీపీ మాజీ నేతలు, ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్న తరుణంలో చంద్రబాబు రంగ ప్రవేశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

చంద్రబాబు ఏం చేసినా అందుకు లాజిక్ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తారు. ఆయన ఏం చేసినా అందుకు ప్రణాళిక ఉంటుందని, ఊరకే ఆయన నోటి వెంట మాటలు రావంటారు. ఏపీలో అనూహ్య విజయం తర్వాత చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో పార్టీ గురించి మాట్లాడుతుండటంతో ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న నేతల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్‌లో పార్టీ సభ్యులను ఉద్దేశించి చేసిన రాజకీయ సందేశం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ తనకు “రెండు కళ్లు” అని పేర్కొన్న చంద్రబాబు తెలంగాణలో టిడిపి ఇంకా “చాలా చురుగ్గా” ఉందని సంతోషం వ్యక్తం చేశారు. 2004 నుంచి 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.. ‘‘నా అరెస్ట్‌ సమయంలో హైదరాబాద్‌లో మీరందరూ నాకు అందించిన తిరుగులేని మద్దతును నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. గచ్చిబౌలిలో లక్ష మందికి పైగా ప్రజలు గుమిగూడి నాకు మద్దతు తెలిపారు. త్వరలో తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తాను. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత అన్నారు.

2014కు ముందు కాలంలా కాకుండా, ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన ప్రత్యర్థులు కావు. టీడీపీ కాంగ్రెస్ వ్యతిరేక శక్తిగా పుట్టింది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ జీరోకి పడిపోయింది. అదే సమయంలో గతంలో తెలంగాణలో టీడీపీలో కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి, ముఖ్యమంత్రిగా ఎదిగినా, చంద్రబాబుకు సఖ్యత కొనసాగుతోంది. అదే కేసీఆర్‌తో సంబంధాలు అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో సీఎంగా ఉంటూ, అమరావతి అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు తెలంగాణలో ఎవరుండాలో చంద్రబాబుకు చాలా క్లారిటీనే ఉంటుంది. అమరావతి భవిష్యత్ తీర్చిదిద్దే క్రమంలో హైదరాబాద్‌లో బేస్ ఉంటే, తనకు అది మరింత మంచిదన్న భావనలో చంద్రబాబు ఉండే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నాలు చేయొచ్చు. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాయో చూడాలి.