ఇండియా చేస్తున్న పనికి…మా రక్తం మరుగుతోంది..
చౌకైన రష్యా చమురు దిగుమతులపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రి కులేబ భారత్‌పై విరుచుకుపడ్డారు. ఇండియా చేస్తోంది నైతికమైన పని కాదన్నారాయన. రష్యన్ దూకుడుతో ఉక్రేనియన్లు ప్రతిరోజూ చనిపోతున్నందున రష్యా చమురును చౌక ధరకు కొనుగోలు చేయడం దారుణమన్నారు. రష్యా నుంచి చమురు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది యూరోపియన్ దేశాలేనంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ మంత్రి స్పందించారు. ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోళ్లలో యూరప్ దేశాలే ముందున్న విషయాన్ని గ్రహించి మాట్లాడాలంటూ గత కొద్ది రోజులుగా జైశంకర్ మాట్లాడుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో యూరప్ దేశాలను వేలెత్తి చూపించడం భావ్యం కాదన్న కులేబ.. ఓహో… వారు కూడా అలాగే చేస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రష్యా నుంచి చౌకగా చమురు కొంటున్న ఇండియా, ఆ దేశం చేస్తున్న అనాగరిక చర్యలతో ఉక్రెయిన్ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో గ్రహించాలన్నారు.
రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించడంలో సహాయం చేయడంలో భారతదేశం, ప్రత్యేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించాలన్నారు.
ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తోందని… భారత ప్రధాని చేసే వ్యాఖ్యలకు గుర్తింపు ఉందని… మోదీ తలచుకుంటే ఏదైనా చేయగలరని ఆయన వ్యాఖ్యానించారు. దురాక్రమణను.. దురాక్రమణగా చూడాలని… ఇండియా అందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భారతదేశం రష్యాతో సన్నిహిత వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఖండించిన ఐక్యరాజ్యసమితి తీర్మానాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంది. మార్పు కోసం ఇండియా ప్రయత్నించాలన్నారు. ప్రయత్నిస్తే మార్పు సాధ్యమేనన్నారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. యుద్ధానికి సమయం కాదని చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నప్పటికీ… రాబోయే వారాల్లో తెరవెనుక దౌత్యం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. యుద్ధాన్ని ముగించడానికి ఏం చేసినా అది మంచిదేనన్నారు.