భద్రాచలం కళ్యాణానికి ముఖ్యమంత్రి ఇచ్చిన కోటి రూపాయలు ఏమయినట్లు?
దక్షిణ భారత అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం రామయ్య దేవస్థానం అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వైభవంగా.. భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి రోజు నిర్వహించే బ్రహ్మోత్సవాల పట్టాభిషేకం, కళ్యాణం వేడుకలకు భక్తులను అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టికెట్లు వసూలు చేసి భక్తులను వివిఐపీ.. వీఐపీలుగా విభజించారు. స్వామివారికి సేవలను సమీపంలో ఉండి చూసుకునే భాగ్యం కలుగుతుంది కదా అని భక్తులు డబ్బులు వెచ్చించి టికెట్లు కొన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ఈ మందిరంలోని వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కానీ ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. స్వామివారి కళ్యాణ వేదిక భక్తుల సంఖ్యను అనుసరించి హైట్ పెంచాలి. అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి.

కానీ గత సంవత్సరం కంటే తక్కువగా, కేవలం మూడు ఫీట్ల ఎత్తులోనే వేదిక ఏర్పాటు చేసి భక్తులకు రాములవారి కళ్యాణ దృశ్యాలను కనిపించకుండా చేశారు. దీంతో రామయ్య భక్తులు అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ల ద్వారా కళ్యాణం చూడాల్సి వచ్చింది. అయితే ఇంత దానికి మేము వ్యయ ప్రయాసలకు ఓర్చి.. టికెట్లు కొని టీవీలో చూడడానికైనా వచ్చింది ..? అంటూ భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. తాము టికెట్లు కొన్నది స్క్రీన్ లలో చూడడానికి కాదు.. స్వామివారిని నేరుగా చూసి తరిద్దామని వచ్చాము.. ఆ అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము ఇచ్చిన టికెట్ రుసుము విషయంపై కోర్టుకు వెళ్లదలిచాము. అని భక్తులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ ముగ్గురిపై మేము కోర్టులో పిటిషన్ వేస్తామంటున్నారు. భక్తులకు సరైన వసతులు కల్పించలేక పోతే టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారని నిలదీస్తున్నారు. దేవుడి విషయంలో ఏం చేసినా భక్తులు సర్దుకుపోతారు అనే నిర్లక్ష్యం పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెల్లించిన టికెట్లకు డబ్బులు తిరిగి ఇస్తారా..? లేదా స్వామి వారిని దర్శనానికి మరో అవకాశం కల్పిస్తారా కోర్టులోనే తెలుసుకుంటామని భక్తులు సవాల్ చేస్తున్నారు.

అయితే స్వామివారి కల్యాణానికి ఒక రోజు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన కోటి రూపాయలు ఎవరికి వచ్చాయి.. వాటిని ఏం చేశారు.? అనే విషయమై భక్తులు ఆరా తీస్తున్నారు. అసలు డబ్బులు ఇచ్చారా..? ఇస్తే వాటిని వేటికి ఖర్చు చేశారు అని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటామన్నారు. దేవాదాయ శాఖ అధికారులు చేస్తున్న తప్పులను కోర్టులోనే తేల్చుకొని, వాటిని పునరావృతం చేయకుండా నిలదీస్తామన్నారు. టికెట్ల విషయంలోనే కాకుండా త్రాగునీరు, మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

