రెండేళ్లలో ఏం మేలు చేశారు?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా? అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో బుధవారం జరిగిన భేటీలో ఆయన చంద్రబాబు నాయుడి పాలనపై నిప్పులు చెరిగారు. వచ్చే ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యే ఉండి పోరాటం చేస్తానని, 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతానని ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో మహిళా భద్రత గాలికి కొట్టుకుపోయిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. “రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, భయపెట్టిన తీరు అత్యంత దుర్మార్గం. ఏడాదిన్నర కాలంగా ఆ మహిళను నరకయాతనకు గురిచేశారన్న ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?,” అని ప్రశ్నించారు. కేవలం రైల్వే కోడూరు ఎమ్మెల్యేనే కాకుండా, ఆముదాలవలస, సత్యవేడు ఎమ్మెల్యేల ప్రవర్తన కూడా జుగుప్సాకరంగా ఉందని, రాష్ట్రం ‘జంగిల్ రాజ్’లా మారిపోయిందని ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ హామీలు పూర్తిగా అబద్ధాలని తేలిపోయాయని మాజీ సీఎం విమర్శించారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించాం. కానీ నేడు పాత పథకాలన్నీ రద్దయ్యాయి. రెండేళ్లలోనే రూ. 3 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి పోయిందో సమాధానం చెప్పాలి,” అని డిమాండ్ చేశారు. మద్యం షాపులు, బెల్టు షాపులన్నీ అధికార పార్టీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపించారు.
సంక్రాంతి వేళ కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల పేరిట సాగిన విచ్చలవిడితనంపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “డీఎస్పీ స్థాయి అధికారి ‘ఊపేయ్.. కుదిపేయ్’ అని మాట్లాడటం బరితెగింపునకు పరాకాష్ట. వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ఫీజు రియింబర్స్‌మెంట్ అందక పిల్లలు చదువులు మానేస్తున్నారు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోయింది,” అని పేర్కొన్నారు.
పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తూ, జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట వేస్తానని జగన్ ప్రకటించారు. “కార్యకర్తలు ప్రజల తరఫున గట్టిగా నిలబడాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేద్దాం. ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు,” అని స్పష్టం చేశారు. ఒకటిన్నర సంవత్సరం పాటు నిరంతరం పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు.

