Home Page SliderTrending Today

చేపలకు దాహం వేస్తే ఏం చేస్తాయి..?

ఎంత సాధారణమైన విషయమైనా దాని లోపల ఉండే రహస్యాలు చాలా మందికి తెలియక పోవచ్చు. ఎప్పుడూ నీటిలో ఉండే చేపలు ఎప్పుడైనా నీళ్లు త్రాగడం చూసారా ? అసలు వాటికి దాహం వేస్తుందా? ఒకవేళ దాహం వేస్తే ఏం చేస్తాయి?

చేపలు పూర్తిగా జలచరాలు అంటే అవి నీటిలోనే బతుకుతాయి. బయటికి వస్తే చనిపోతాయి. మరి జీవితాంతం నీటిలో ఉండే చేపలు నీళ్లు త్రాగుతాయి అంటే త్రాగుతాయి. అలాగే త్రాగవా అంటే త్రాగవు కూడా. ఉదాహరణకు ఉప్పు నీటి చేపలు నీళ్లు త్రాగుతాయి. అదే మంచి నీటిలో ఉన్న చేపలు నీళ్లు త్రాగవు. నీటిలో ఉండే చేపలు ఓస్మోసిస్ అనే ఫ్లూయిడ్ రూల్‌ని పాటిస్తాయి. దీని ప్రకారం రెండు వేరు వేరు గాఢతలు గల ద్రవాలను ఒక సన్నటి పొర విడదీస్తుంటే నీరు ఎక్కువ గాఢత గల ద్రవం వైపు ప్రవహిస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే మంచి నీటి చేపలు నీళ్లని త్రాగవు. అలాగే ఉప్పు నీటి చేపలు నీళ్లు త్రాగుతాయి. మంచి నీటిలో ఉండే చేప శరీరంలోని ద్రవం దానిచుట్టూ ఉండే నీటి గాఢత కన్నాఎక్కువగా ఉంటుంది. అందువల్ల బయట ఉండే నీరు ఆ చేప చర్మం మొప్పల ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అలా దాని శరీరంలోకి ప్రవేశించిన నీటిని చేప బయటకు వదలకపోతే సమయం గడిచే కొద్దీ ఎక్కువ నీరు చేరడం వల్ల దాని శరీరం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే మంచి నీటి చేప నీళ్ళను త్రాగవు.

ఇక ఉప్పు నీటి చేపల విషయంలో ఈ ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇక్కడ చేప చుట్టూ ఉండే నీటి గాఢత ఎక్కువగా ఉండడంతో చేప శరీరంలో నీరు బయటికి ప్రవేశిస్తుంది. అందువల్ల ఉప్పు నీటి చేప సమయం గడిచే కొద్దీ శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల కృశించి ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు ఆ చేప చుట్టూ ఉండే నీటిని మొప్పలు నోటి ద్వారా త్రాగుతుంది. ఆ నీరు దాని శరీరంలోకి చేరకముందే మొప్పలు ఉప్పు నీటిలోని ఉప్పును బయటకు పంపిస్తాయి. ఇది చేపలు నీరు త్రాగడం వెనకున్న సైన్స్.