నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుగా, ఐసీసీ ఎన్నికలో పాకిస్తాన్ తీరు
అనుకున్నామని అవ్వవు కొన్ని. అనుకోలేదని ఆగవు మరికొన్ని అన్నట్టుగా సీన్ కన్పిస్తుంది. మనం చేసినా, చేయకపోయినా, ఫలితం ఎలా వస్తుందో ముందే తెలిస్తే, అప్పుడు మనం ఏం చేయాలన్నదానిపై క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఐసీసీ చీఫ్ ఎన్నిక విషయం కూడా అదే విధంగా జరిగింది. సభ్యులంతా ఒకవైపున్నప్పుడు, తాము ఓటేసినా, వేయకపోయినా ఫరక్ పడదన్న విషయం తెలిసిన పాకిస్తాన్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఐసీసీ చీఫ్ ఎన్నికలో మొత్తం 16 మంది సభ్యులుండగా, జయషాకు 15 మంది సభ్యుల మద్దతు లభించింది. ఐసీసీ చీఫ్ ఎన్నిక జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మౌనం దాల్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్వతంత్ర అధ్యక్షుడిగా జయషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. BCCI సెక్రటరీగా ఉన్న జయషా 1 డిసెంబర్ 2024న ICC పదవిని స్వీకరిస్తారు. ఎన్నికల తర్వాత, ఛైర్మన్ పదవికి ఏకైక నామినీగా జయషా ఉన్నారు. ఇప్పటి వరకు క్రికెట్ ఉన్న స్థాయి నుంచి మరింత ఉన్నత స్థానానికి తాను క్రికెట్‌ను తీసుకెళ్తానని ఈ సందర్భంగా జయ్‌షా చెప్పారు. క్రికెట్ స్థాయిని, ప్రజాదరణను వచ్చే రోజుల్లో మరింతగా పెంచుతానని ఈ సందర్భంగా జయషా తేల్చి చెప్పారు. 2028 లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్ సందర్భంగా క్రికెట్ విస్తృతిని మరింతగా పెంచుతానన్నారు.
ఐసీసీలో ప్రస్తుతం 16 మంది సభ్యులు ఉన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో, షాకు 15 మంది మద్దతు లభించింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్నికను చూస్తూ మిన్నకుండిపోయింది. “PCB నుండి ఎటువంటి మాట రాలేదు. జయషాకు సభ్యుల నుండి అత్యధిక మద్దతు లభించడంతో, పాకిస్తాన్ నిర్ణయం కీలకం కాలేదు. కానీ మొత్తం ప్రక్రియలో పాకిస్తాన్ బోర్డు ప్రేక్షకుడి పాత్రను పోషించింది.” అని నివేదిక పేర్కొంది. అసలు మ్యాటరేంటంటే, ఇండియా తీరుతో పీసీబీ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింది. పాకిస్తాన్ వెళ్లి ఆడేందుకు కీలక జట్లు సిద్ధంగా లేకపోవడానికి కారణం ఇండియానే. ఇండియా గానీ, పాకిస్తాన్ వెళ్లి క్రికెట్ టోర్నీల్లో పాల్గొంటే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా బలపడేది. కానీ ఇండియా నుంచి సహకారం లేకపోవడంతో పాకిస్తాన్ చాన్నాళ్లుగా ఇబ్బందిపడుతోంది. ఐసీసీ చీఫ్ గా ఇండియన్ జయషాకు మద్దతిస్తే, ఆ దేశంలో బోర్డు సభ్యులకు ఇబ్బందులు తప్పవు. అందుకే ఏం చేస్తే ఏమవుతుందోనని బోర్డు ఎన్నిక సమయంలో సైలెంట్ గా ఉండిపోయింది. అటు అనుకూలంగానూ, ఇటు వ్యతిరేకంగానూ ఓటేయకుండా చూస్తూ ఉండిపోయింది.

ఇక ఎన్నికలో విజయం సాధించడపట్ల జయషా ఆనందం వ్యక్తం చేశారు. ” ఐసీసీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ విస్తృతిని పెంచుతాను. సభ్య దేశాలతో సన్నిహితంగా పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. క్రికెట్ వివిధ రకాల ఫార్మాట్లతో ప్రస్తుతం ఒత్తిడి ఎక్కువవుతోంది. దీంతో మొత్తం పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. అధునాతన సాంకేతికతను స్వీకరించడం, ప్రోత్సహించడం ఇక్కడ ముఖ్యమైన విషయాలు. క్రికెట్‌ను ఇంకా ఎక్కువగా విస్తృతం చేసి, గ్లోబల్ మార్కెట్‌లకు సంబంధించిన ఈవెంట్‌లు నిర్వహించి మునుపెన్నడూ లేనంత జనాదరణ పొందేలా చేయడం లక్ష్యమన్నారు జయషా. “మేము నేర్చుకున్న విలువైన పాఠాలను రూపొందించేటప్పుడు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పట్ల ప్రేమను పెంపొందించడానికి మనం సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను కూడా స్వీకరించాలి. లాస్ ఏంజిల్స్ 2028లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం వల్ల, వచ్చే రోజుల్లో క్రికెట్ అపూర్వమైన రీతిలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తున్నాను.” అని జయషా చెప్పారు.