ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి ఏం డిమాండ్ చేశారంటే..?
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం స్థాపించడంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ సీఎం కేంద్రం ముందు పలు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది.కాగా గత రెండు రోజులు ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీల్లో సీఎం ముఖ్యంగా అమరావతి నిర్మాణం,ఇతర కీలక ప్రాజెక్టులు,పథకాల అమలు కోసం ప్రధానితో, మంత్రులతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటి కోసం చంద్రబాబు కేంద్రాన్ని రూ.లక్ష కోట్లకు పైగా నిధులను కోరినట్లు ఎకనామిక్,బ్లూమ్‌బర్గ్ పత్రికలు వెల్లడించాయి. కాగా సీఎం కేంద్ర బడ్జెట్‌లో ఈ కేటాయింపులు చేయాలని ప్రధాని మోదీపై ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నాయి. అయితే ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.50 వేల కోట్లు,పోలవరానికి రూ.12 వేల కోట్లు ,ఆర్థిక లోటు భర్తీకి రూ.7 వేల కోట్లు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం.