విమాన ప్రమాదంలో ఏఏ దేశాల పౌరులు ఉన్నారంటే..
అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయిపటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికుల విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ భవనంపై కూలిపోయింది. మొత్తం ప్రయాణికులలో 169 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడాకు చెందిన వారున్నారు. మరోవైపు విమానం కుప్పకూలిన బీజే కళాశాల హాస్టల్లో ఉన్న విద్యార్థుల్లో కొందరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికుల సమాచారం కోసం 1800 5691 444 నంబరు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హుటాహుటిన సంఘటన స్థలికి బయల్దేరారు. అత్యవసర బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, క్షేత్రస్థాయి పరిస్థితులను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎయిరిండియా-171 విమాన ఘటనపై ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎప్పటికప్పుడు బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.