రాహుల్ గాంధీ ముందున్న ఆప్షన్సేంటి?
ఎంపీగా కొనసాగడం ఎలా?
రాహుల్ గాంధీ అనర్హత బయటపడొచ్చా?
పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు అరుదు
గుజరాత్ హైకోర్టుకా? సుప్రీం కోర్టుకా?
2019లో జరిగిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో… కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… ఇకపై పార్లమెంటు సభ్యుడు కారంటూ లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. కేరళలోని వాయనాడ్‌కు చెందిన ఎంపీ నిబంధనల ప్రకారం జైలు శిక్ష విధించడంతో ఎంపీగా అనర్హుడని కొంతమంది న్యాయ నిపుణులు చెప్పగా… మరికొందరు మాత్రం నేరారోపణ రద్దయితే… లోక్ సభ నిర్ణయాన్ని నిలిపివేయొచ్చంటున్నారు. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేయడంతోపాటు… శిక్షను 30 రోజుల పాటు కోర్టు సస్పెండ్ చేసింది. కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి అనుమతించినప్పటికీ… కోర్టు ఉత్తర్వులతో రాహుల్ పార్లమెంటు సభ్యునిగా అనర్హత తప్పదని కొందరు న్యాయ నిపుణులు తెలిపారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, పార్లమెంటు సభ్యుడు ఏదైనా నేరానికి పాల్పడి కనీసం రెండేళ్ల జైలు శిక్ష విధించిన వెంటనే, సదరు వ్యక్తిపై అనర్హత వేటు పడుతుంది. సూరత్ కోర్టు ఆదేశం ఆధారంగా, లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి, ఆయన నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ స్థానానికి ప్రత్యేక ఎన్నికలను ప్రకటించవచ్చు. గాంధీని సెంట్రల్ ఢిల్లీలోని తన ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేయమని కోరవచ్చు. రాహుల్ గాంధీ ఇప్పుడు కోర్టులో నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు.

ఐతే ఎన్నికల కమిషన్‌తో సంప్రదించి ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటే రాష్ట్రపతి మాత్రమే చేయగలరని, ఈ చర్యకు చట్టబద్ధత ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కోర్టు తీర్పు ప్రకారం ప్రకారం రాహుల్ గాంధీ అనర్హుడని ప్రముఖ న్యాయవాది, బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉండి.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కపిల్ సిబాల్ సైతం ఈ వ్యవహారంపై ఆసక్తికర విశ్లేషణ అందించారు. కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో రాహుల్ MPగా అనర్హుడయ్యాడన్నారు. కోర్టు కేవలం శిక్షను సస్పెండ్ చేస్తే సరిపోదని… నేరారోపణపై స్టే విధించాలన్నారు. దోషిగా ఉన్న కేసుపై స్టే ఇస్తేనే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా కొనసాగగలడన్నారు సిబల్.