Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

శభాష్ పవన్ కళ్యాణ్

అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలనా శైలిపై ప్రశంసల వర్షం కురిపించారు. విభిన్నమైన సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పరిపాలనలో అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిస్తున్న చొరవ, వేగవంతమైన నిర్ణయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ కార్యదక్షతను వివరిస్తూ సీఎం ఒక ఉదాహరణను ప్రస్తావించారు. ఇటీవల 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో, ఒక కానిస్టేబుల్ తన గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని విన్నవించుకున్నారని తెలిపారు. ఆ సమస్యపై పవన్ తక్షణమే స్పందించి, వేదికపై నుంచే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని వెల్లడించారు. పవన్ చూపిన ఈ వేగం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ప్రశంసించారు.
అదే సమయంలో అధికారుల పనితీరుపై సీఎం కీలక దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సులు కేవలం మొక్కుబడిగా కాకుండా, ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలతో జరగాలని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్య విద్యార్థుల్లా ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఫైళ్లను పరిష్కరించకుండా ఒకరి నుంచి మరొకరికి పంపిస్తూ కాలయాపన చేసే విధానం మారాలని, వ్యవస్థలోని లోపాలను అలుసుగా తీసుకుని పనుల నుంచి తప్పుకోవడం సరికాదని హెచ్చరించారు.
పాలనలో సాంకేతికత ప్రాధాన్యతను వివరిస్తూ, డేటా ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చొరవతో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం శుభపరిణామమని, ప్రతి శాఖ ఆన్‌లైన్ ద్వారా పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్వీర్యమైన కేంద్ర ప్రాయోజిత పథకాలను తిరిగి పునరుద్ధరిస్తున్నామని పేర్కొంటూ, ప్రజల్లో సంతృప్తిని పెంచడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.