Andhra Pradesh

వెదర్ అలర్ట్… ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

◆ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు
◆ పిడుగుపాటుకు ముగ్గురు మృతి మరో ఇద్దరికి గాయాలు
◆ పొంగిపొర్లుతున్న నదులు చెరువులు
◆ పలు గ్రామాలు, కాలనీలు జలమయం
◆ ఆందోళనలో అన్నదాతలు

కోస్తాంధ్ర మీదగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. దీంతో అనేక చోట్ల వాగులు చెరువులు చిన్న నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులుకు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వర్షాలు దసరా వేడుకలపై కూడా తీవ్ర ప్రభావం చూపించాయి. పండుగ పురస్కరించుకొని సొంత గ్రామాలకు బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు తప్పడం లేదు.

అకాల వర్షంతో రైతన్నలకు కొంతమేర పంట నష్టం వాటిల్లింది. ఎండతెరపిలేని వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో పాటు ఒక్కసారిగా విరుచుకుపడిన పిడుగులు గుంటూరు ప్రకాశం జిల్లాలో మూడు కుటుంబాలకు కన్నీళ్లు మిగిల్చాయి. పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళిన రైతులు ఎంతకీ తిరిగే రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలాల వద్దకు వెళ్లి చూస్తే విగతా జీవులుగా పడి కనిపించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్ళమూడి కి చెందిన యలమంద, పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి లో చంద్రశేఖర్, ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యవరం లో ఆంజనేయులు అనే రైతులు పిడుగుపాటు వల్ల మృతి చెందారు. ఒకేరోజు అన్నదాతలు చనిపోవడంతో మృతుల కుటుంబాల్లో వారి స్వగ్రామాలలో విషాదఛాయలు అలముకున్నాయి. మరో మూడు రోజులు పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది.