ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తాం.. ఏ సాయమైనా చేస్తాం..!
వరల్డ్ టూరిజం మ్యాప్‌లో ఆంధ్రరాష్ట్రాన్ని నిలపాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి హోటల్స్ రావాలి
మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చి సహాయ, సహకారాలు అందిస్తున్నాం
విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్
ఆంధ్రరాష్ట్రాన్ని వరల్డ్ టూరిజం మ్యాప్‌లో నిలిపేందుకు ముందుకువచ్చే ప్రతి సంస్థకు చేయూతనిచ్చి ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇంటర్నేషనల్ హోటల్స్ రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. హోటల్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. విజయవాడలోనే కాకుండా ఆంధ్రరాష్ట్రమంతటా ఇటువంటి ప్రసిద్ధిగాంచిన హోటల్స్ రావాలని, వరల్డ్ టూరిజం మ్యాప్‌లో రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానం రావాలని ఆకాంక్షించారు. అందుకోసం మంచి టూరిజం పాలసీని తీసుకువచ్చామని, రాష్ట్రంలో హోటల్స్ స్థాపించే సంస్థలను ప్రోత్సహిస్తూ వస్తున్నామని చెప్పారు.

11 సంస్థలు రాష్ట్రంలో బ్రాంచీలు ఏర్పాటు
ఒబేరాయ్ హోటల్స్ మొదలుకొని నేడు ప్రారంభించిన హయత్ ప్లేస్ వరకు మొత్తం 11 పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్రంలో వారి బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయని సీఎం జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను వరల్డ్ టూరిజం మ్యాప్‌లో పెట్టేందుకు ప్రభుత్వ పరంగా వారికి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఇంకా నలుగురికి స్ఫూర్తిని ఇవ్వాలని, అనేక మంది పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపేవారందరికీ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం హోటల్ చైర్మన్ వీరస్వామి, హయత్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఏరియా ప్రెసిడెంట్ శ్రీకాంత్, చైర్మన్ వీరస్వామి తనయుడు కార్తీక్, ఈ ప్రాజెక్టులో మమేకమైన వారందరికీ సీఎం జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.