ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదు
ప్రభుత్వ భూములు , ప్రజా ఆస్తుల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌లతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్యలపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. దశాబ్దాలుగా బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట్ ప్రాంతాల్లో మైనార్టీలు శ్మశానవాటికలు లేక పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి, రక్షణ శాఖ, రెవెన్యూ మరియు వక్ఫ్ బోర్డ్ సమన్వయంతో భూ మార్పిడి ప్రక్రియను పూర్తి చేసి ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు.
ముఖ్యంగా ప్రభుత్వ భూములను స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జా చేసే ప్రయత్నాలను సహించేది లేదని పొంగులేటి స్పష్టం చేశారు. ఆక్రమణలను గుర్తించిన వెంటనే నోటీసులు జారీ చేసి, అవసరమైతే బలవంతంగా ఖాళీ చేయించి భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వివాదాల్లో ఉన్న భూముల విషయంలో న్యాయపరంగా గట్టిగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పేదల సంక్షేమం మరియు అభివృద్ధి పనుల కోసం కేటాయించిన భూములను కాపాడటంలో రాజీ పడబోమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

