హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలుపుతాం
ప్రజల మనోభావాలకు విరుద్ధంగా గత ప్రభుత్వం హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్ధిపేట జిల్లాలో కలిపిందని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శనివారం శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, హుస్నాబాద్ కరీంనగర్ జిల్లాలోనే ఉండాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని ఆయన గుర్తు చేశారు. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌లోని అంబేద్కర్ సర్కిల్‌లో ప్రజలకు ఇచ్చిన హామీని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.
హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని నాడే ప్రకటించామని, ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన లేదా సరిహద్దుల మార్పు ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టినప్పుడు హుస్నాబాద్ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఆయన వివరించారు. భవిష్యత్తులో జిల్లాల మార్పులు, చేర్పులు జరిగే క్రమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

