కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళాభ్యున్నతికి అనేక పథకాలు తీసుకొచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పర్యటించారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ , దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 14 వేల రేషన్ కార్డులు జారీ చేశామని, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఈ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోగా, తాము అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాలోనే లక్ష రేషన్ కార్డులు అందించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళాభ్యున్నతికి అనేక పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ వంటి కార్యక్రమాలతో పాటు మహిళలను బస్సుల యజమానులుగా మారుస్తున్న పథకాలు కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. తాము చేస్తున్న అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలపై విపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

