వైసీపీకి మించిన పథకాలు అమలు చేస్తాం
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన జోరుగా కొనసాగుతోంది. కుప్పంలో మూడోరోజు కృష్ణదాసనపల్లె, యానాదిపల్లి, జరుగు, గుడ్లనాయనపల్లి, గుడుపల్లె మండలం ఓఎన్ కొత్తూరు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. మొన్న గురువారం అన్న క్యాంటీన్ విధ్వంసంతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్సీ భరత్ నివాసం వైపుగా చంద్రబాబు వెళ్లాల్సి ఉండడంతో 200 మందితో భారీభద్రతను ఏర్పాటు చేసారు.

గుడిపల్లె మండలం కొత్తూరు సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రజలకు వైకాపా కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. తాము పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసారు. తాము అధికారంలోకి వస్తే నవరత్నాలకు మించిన పథకాలు అమలుచేస్తామన్నారు. జగన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాదిరి నియంతలా తయారయ్యాడని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఇంటికో సైకోను తయారుచేస్తున్నారని, తండ్రి వైఎస్‌ను అడ్డం పెట్టుకుని అప్పట్లో లక్షల కోట్లు దోపిడీ చేసారని ఆరోపించారు.

ఆఖరుకు వినాయకచవితి పందిళ్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి మద్యంపై కూడా 25 వేల కోట్లు అప్పులు తెచ్చారని విమర్శించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.
సీయం జగన్ గడప గడపకూ ఎమ్మెల్యేలను, మంత్రులను పంపిస్తూ వారి పథకాలను ప్రచారం చేస్తూ, ఈసారి ఎలాగైనా మొత్తం 175 సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.