ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో ఇవ్వాలని తాము మొదటి నుంచే డిమాండ్ చేస్తూ వచ్చామని, కానీ ఇన్నాళ్లు నాటకాలతో కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు జీవో ద్వారానే ఎన్నికలకు వెళ్తోందని విమర్శించారు.
బీసీ బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ పేర్లు చెప్పి ప్రభుత్వం ఆలస్యం చేసిందని, చివరికి జీవో తీసుకురావడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ఈ జీవోలో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం లేకపోవడం సంతోషకరమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాటకాలనే తాము వ్యతిరేకించామని, కానీ ఎప్పుడూ బీసీ బిల్లును వ్యతిరేకించలేదని రామచందర్ రావు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన కోరారు. అన్ని స్థానాలకు బీజేపీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని, అభ్యర్థులు దొరకని పరిస్థితి ఇతర పార్టీలదేనని ఎద్దేవా చేశారు.