ఎవరు తక్కువ ధరకు ఇస్తే వారి దగ్గరే చమురు కొంటాం
ఇండియా అవసరాల కోసం చమురు ఎవరి దగ్గర్నుంచైనా కొంటుంది. దేశ ప్రజలకు అవసరమైన చమురు కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. భారతదేశంలో ఉన్న జనాభా అవసరాల తీర్చడానికి… చమురును ఎక్కడి నుండైనా కొనుగోలు చేస్తుందని పేర్కొంది.

భారత ప్రభుత్వం తన పౌరులకు ఇంధనాన్ని అందించాల్సిన నైతిక బాధ్యతను కలిగి ఉందని… చమురును ఎక్కడి నుండైనా కొనుగోలు చేయడం కొనసాగిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేయొద్దని ఒక్క దేశం కూడా చెప్పలేదన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థపై ప్రభావాన్ని చూపిందని… సరఫరా, డిమాండ్‌కు అంతరాయం కలిగించిందని… దీర్ఘకాల వాణిజ్య సంబంధాలను విచ్ఛిన్నం చేసిందన్నారు మంత్రి పూరి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు, వ్యాపారాల కోసం ఇంధన ధరలు పెరగడంతో సామాన్యులతోపాటు… పరిశ్రమలు, అనేక దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. రష్యా నుండి భారతదేశం ముడి చమురు దిగుమతులు ఏప్రిల్ నుండి 50 రెట్లు పెరిగాయి. ఇప్పుడు ఇది విదేశాల నుండి కొనుగోలు చేయబడిన మొత్తం ముడి చమురులో 10 శాతం మాత్రమే. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో రష్యా చమురు కేవలం 0.2 శాతం మాత్రమే.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యా నుండి ఇంధన కొనుగోళ్లను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. చమురును పెద్ద ఎత్తున వినియోగిస్తున్న భారతదేశం లాంటి దేశంలోని ప్రజల కోసం ఇండియా చమురు ఎక్కడ కొంటుంది. ఎంతకు కొంటుంది అన్న అంశాలు అప్రస్తుతమన్న అభిప్రాయాన్ని కేంద్ర చమురు శాఖ మంత్రి వ్యక్తం చేశారు. అందుకే ఇండియా… తన ప్రజలకు కావాల్సిన చమురును ఎక్కడ్నుంచైనా కొంటామని తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని భారత్‌కు ఎవరూ చెప్పలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమెరికా నుంచి ఇండియా 20 బిలియన్ల డాలర్ల విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని… మరింత ఇంధనాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నామని హర్దిప్ పూరి చెప్పారు. గ్రీన్ ఎనర్జీపై పని కొనసాగుతుండగా, సాంప్రదాయ అన్వేషణ, చమురు, వాయువు ఉత్పత్తి కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని పెంచాలన్న ఆలోచనలో ప్రపంచదేశాలున్నాయ్.

