అవినీతి ప్రభుత్వాన్ని కూలగొడతాం… నేను మాటిస్తున్నాను…
తెలంగాణలో అనినీతి ప్రభుత్వాన్ని కూలగొడతామని, నేను తెలంగాణ ప్రజలను మాటిస్తున్నానని ప్రధాని మోదీ బేగంపేట సభలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనను విజయవంతంగా ముగించుకుని.. హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోదీకి స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ సభ నిర్వహించారు.

భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలను దోచుకుంటున్న వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని ప్రజలకు మోసం చేశారన్నారు. ఎనిమిదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శలు చేశారు. అవినీతి పరులంతా కూటిమిగా వస్తున్నారని.. ఇక వాళ్ల ఆటలు సాగవు అని హెచ్చరించారు. కొందరు భయంతో, మూఢ నమ్మకాలతో మోదీని బూతులు తిడుతున్నారు. వాళ్ల దగ్గర తిట్లు తప్ప.. మరేమీ లేదన్నారు. నన్ను తిట్టినా పట్టించుకోను కానీ.. తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వమే మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తుందని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక కుటుంబం కోసం పని చేస్తుందని.. ప్రతి కుటుంబ కోసం పని చేసే బీజేపీ ప్రభుత్వం కావాలన్నారు. తెలంగాణ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లి కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ తెలిపారు.

