Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsviral

జగన్ పర్యటనను అడ్డుకుంటాం

డాక్టర్ సుధాకర్ తల్లి, కుటుంబ సభ్యులకు జగన్ స్వయంగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జగన్ పర్యటనను అడ్డుకుంటాం, అని బుధవారం దళిత సంఘాలు గట్టి హెచ్చరిక జారీ చేశాయి. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పర్యటనకు సిద్ధమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పర్యటనకు ముందే ఆయన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. క్షమాపణ చెప్పకపోతే పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశాయి.
డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్‌మోహన్ రెడ్డే కారణం. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. కరోనా సమయంలో ఒక డాక్టర్ పై మాస్క్, పీపీఈ కిట్ ఇవ్వకుండా, చనిపోయే స్థితికి ప్రభుత్వం తెచ్చిందని ఇప్పుడు అదే ప్రాంతంలో మెడికల్ కాలేజీ కడతానని చెప్పడం ప్రజలను మోసం చేయడమే, అని మండిపడ్డారు.
ఒక వైద్యుడి ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం, మరో వైద్య విద్యార్థుల భవిష్యత్తు ఎలా కాపాడగలరు ? అని దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ మరణంపై ఇప్పటివరకు న్యాయం జరగలేదని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురువారం జరగనున్న జగన్ నర్సీపట్నం పర్యటన సందర్భంగా ఈ హెచ్చరికలు జారీ కావడంతో అక్కడి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.
నర్సీపట్నం పర్యటనకు ముందే దళిత సంఘాల ఈ వార్నింగ్ వైసీపీ వర్గాలను కలవరపెడుతోంది.