NationalNews

ఈ గవర్నర్‌ మాకొద్దు.. రాష్ట్రపతికి డీఎంకే సర్కార్‌ ఫిర్యాదు

తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ వివాదం ఢిల్లీకి చేరింది. ఇలాంటి గవర్నర్‌ మాకొద్దంటూ డీఎంకే ప్రభుత్వం ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమోరాండం సమర్పించింది. గవర్నర్‌ను వెంటనే తొలగించాలని కోరింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడతానంటూ చేసిన ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘించారని విమర్శించారు.

బాధ్యత గల పదవిలో ఉండి కూడా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చేసే వ్యాఖ్యలు  ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రభుత్వం ఆరోపించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేందుకు అనర్హులని, వెంటనే తొలగించాలని డీఎంకే ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొంది. పలు బిల్లులు గవర్నర్‌ వద్దే ఆగిపోయాయని, ఆమోదం పొందాల్సిన బిల్లులు 20 వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. తమిళనాడే కాకుండా కేరళ, తెలంగాణలో కూడా కొద్దికాలంగా గవర్నర్‌, ప్రభుత్వానికి మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉంది.