Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

బల్క్ డ్రగ్ పార్క్‌ను ఆపే అధికారం మా పరిధిలో లేదు : కలెక్టర్

బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటు కు సంబంధించి రాజయ్యపేటలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్‌ అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ జరిగింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. బల్క్ డ్రగ్ పార్క్‌ను ఆపాలని, వేరే ప్రాంతానికి తరలించాలని వారు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “బల్క్ డ్రగ్ పార్క్‌ను ఆపే అధికారం మా పరిధిలో లేదు. ప్రజల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం” అని చెప్పారు. గ్రామంలో ప్రస్తుతం పార్క్ నిర్మాణ పనులు మొదలుకాలేదని, రోడ్ల పనులు మాత్రమే కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటు చుట్టూ ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, ముఖ్యంగా మత్స్యకారులు గట్టిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా జీవనాధారం సముద్రమే, దాన్ని దూరం చేయొద్దు. ఈ పార్క్ వల్ల సముద్రం కాలుష్యానికి గురై చేపలు చనిపోతాయి, ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఈ విషయంపై 41 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.

అయితే, కలెక్టర్ వ్యాఖ్యలపై మత్స్యకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ బల్క్ డ్రగ్ కంపెనీ తరఫున మాట్లాడుతున్నారు. పార్క్ అంటే కేబీఆర్‌ లేదా లుంబినీ పార్క్‌ కాదు ఇది మా జీవితాలను నాశనం చేసే ప్రాజెక్ట్‌. కాకినాడ ప్రజలే మనుషులా? మేము మనుషులం కాదా? మా మీద పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలి, వాటిని పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజయ్యపేట ప్రజలందరూ బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకించారని, కొందరు టీడీపీ నేతలు మాత్రమే దీనికి అనుకూలంగా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. 1000 కోట్ల ప్రాజెక్ట్ కోసం 50,000 మందిని నాశనం చేస్తారా? అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు.ఇక గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలు మాత్రం తమ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ వివాదం కొనసాగే అవకాశం ఉంది.