కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకి కారణం మేమే: కేజ్రివాల్
దేశరాజకీయాలపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశరాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చడంలో ఆప్ విజయం సాధించిందని సీఎం కేజ్రివాల్ అన్నారు. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయాన్ని సొంతం చేసుకోవడంలో మేనిఫెస్టో చాలా కీలకంగా మారిన విషయ తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఆప్ మేనిఫెస్టోని అనుసరించే కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని కేజ్రివాల్ అభిప్రాయపడ్డారు. ఉచిత విద్య,నిరుద్యోగ భృతి, ఉచిత రేషన్ వంటి హామీలతోనే కాంగ్రెస్ అక్కడ గెలిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోని పార్టీలన్నీ ఆప్ ప్రేరణతో విద్య,ఆరోగ్యంపై దృష్టిసారించాయని కేజ్రివాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవల యూపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ అభ్యర్థులను కేజ్రివాల్ అభినందించారు.