“మేం పాలకులం కాదు..మీ సేవకులం” ముఖ్యమంత్రిగా రేవంత్ తెలంగాణా ప్రజలకు హామీ
తమది పాలించే ప్రభుత్వం కాదని, ప్రజలకు సేవకులుగా పనిచేసే ప్రభుత్వమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రమాణ స్వీకారం మొదలయినప్పుడే, ప్రగతి భవన్‌లో తెలంగాణ ఘడీగా నిర్మించుకున్న ఇనుపకంచెలను బద్దలు కొట్టించామని, తమ తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా స్వేచ్ఛగా ప్రగతి భవన్‌కు రావొచ్చని తెలియజేశారు. తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, కానీ గత దశాబ్దంగా దొరల పాలనతో మగ్గి పోయిందన్నారు.

రేపు ఉదయం పది గంటలకు జ్యోతిరావ్ ఫూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్భారు నిర్వహిస్తామన్నారు. నగర శాంతి భద్రతలు కాపాడుతూ, ఈ రాష్ట్రాన్ని కేవలం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలబెడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ ఆశీస్సులతో సమర్థ పాలన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగించుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో శ్రమించిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. ముందుగా నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ప్రకారం తుమ్మల రజని అనే దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. అపాయింట్‌మెంట్ లెటర్‌ను వేదిక మీదనే అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.