ముందస్తు ఎన్నికలకు వెళ్లం: సజ్జలరామకృష్ణారెడ్డి
ఏపీలో ముందస్తు ఎన్నికల అవసరం వైసీపీకి లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ నీ బతికించుకునేందుదుకే చంద్రబాబు ముందస్తు రాగం తీస్తున్నారని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి ఊపు కనిపించకపోవడంతో ముందస్తు ఎన్నికల హడావిడి చేయడం ద్వారా నలుగురు కార్యకర్తలన్న వస్తారనే ఆశతో చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తోడు ఆయన అనుకూల మీడియా కూడా అదే పాట పాడుతుందన్నారు. వైసీపీకి సంబంధించినంతవరకు ముందస్తు, వెనకస్తూ అంటూ ఏమీ లేదన్నారు. ఐదు సంవత్సరాల పాటు పరిపాలించమని ప్రజలు తమ పార్టీకి అధికారం ఇచ్చారని ఆ సమయం వరకు పాలన అందిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికే అమలు చేశామని, ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని అమలు చేసాం మళ్ళీ దీవించండి అంటూ ప్రజల వద్దకు వెళ్లాలని సీఎం జగన్ ఆలోచన అని అన్నారు.

రాత్రికి రాత్రే ఏదో మారిపోతుంది, లెక్కలు మారిపోతాయి, గ్రహగతులు సరిగా లేవు, ఆ పార్టీ ఈ పార్టీ కలుస్తాయి, మరేదో పార్టీలు విడిపోతాయేమో, ఈ వర్గాలలో వ్యతిరేకత వస్తుందేమో, ఇలాంటి చెత్త ఆలోచనలతో పార్టీలు నడిపే వారి ఆలోచనలే ముందస్తు హడావుడి అని ఎద్దేవ చేశారు. టీడీపీ కార్యకర్తలలో ఉత్సాహం నింపడం కోసం చంద్రబాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. అలానే విభజన అంశాల విషయంలో ఏపీ ప్రయోజనాలు కాపాడే విషయంలో తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు కూడా వెళ్లినట్లు చెప్పారు. విభజన అనంతరం ఏపీకి రావాల్సినవి ఏమున్నా వాటికి ఒత్తిడి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

