NationalNews Alert

వాళ్ల వల్లే ఇప్పుడు అధికారంలో ఉన్నాం: నితిన్ గడ్కరీ

ఇటీవలే ప్రకటించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు కోల్పోయిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తాము ఇప్పుడు అధికారంలో ఉన్నామంటే అందుకు బీజేపీ అగ్రనేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

నాగ్‌పూర్‌లో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. 1980లో బీజేపీ ముంబైలో నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సదస్సులో వాజ్‌పేయి మాట్లాడుతూ.. ”ఏదో ఒకరోజు చీకటి తొలగిపోతుంది. సూర్యుడు బయటికొస్తాడు. కమలం వికసిస్తుంది” అని అటల్‌ జీ ఆ రోజు వ్యాఖ్యానించారన్నారు. ”ఆ సదస్సులో నేను ఉన్నాను. నాడు వాజ్‌పేయీ ప్రసంగాన్ని విన్నవారంతా అలాంటి ఒకరోజు వస్తుందని విశ్వసించారు. అటల్‌, ఆడ్వాణీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, ఇంకా మరెందరో కార్యకర్తలు విశేషంగా కృషిచేయడం వల్లే మనం ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలో ఉన్నాం” అని గడ్కరీ పేర్కొన్నారు.
ప్రస్తుతం అధికారమే కేంద్రంగా రాజకీయాలు సాగుతున్న తీరు పై కూడా గడ్కరీ స్పందించారు. రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారని అయితే, దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజ, ఆర్థిక సంస్కర్తలు మాత్రం చాలా ముందుచూపుతో ఆలోచిస్తారని, వారు వచ్చే శతాబ్దం గురించి కూడా ఆలోచిస్తారన్న ఆరెస్సెస్ సిద్ధాంతకర్త దివంగత దత్తోపంత్ ఠెంగడీ గతంలో చేసిన వ్యాఖ్యలను గడ్కరీ గుర్తు చేశారు.