వయనాడ్ దుర్ఘటన- 50 కి చేరిన మృతుల సంఖ్య
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో ఆకస్మికంగా కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించింది. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి వద్ద నేడు తెల్లవారుజామున భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 50 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో శిథిలాల కింద నుండి బాధితులు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. భారీగా వర్షాలు కురవడంతో అక్కడ ఉన్న ఒకే ఒక వంతెన కూలి సహాయక సిబ్బంది వెళ్లలేక పోతున్నారు. సైన్యం సహాయంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాయుసేనకు చెందిన రెండు హెలికాఫ్టర్‌లు వయనాడ్‌కు చేరుకున్నాయి. భారీ వర్షాల కారణంగా హెలికాఫ్టర్ కూడా పరిమిత స్థాయిలోనే సేవలు అందించగలుగుతున్నాయి. కొండ చరియలు విరిగి పడిన కారణంగా అక్కడ ల్యాండ్ అయ్యే పరిస్థితి కూడా లేకపోతోంది. కేరళ ప్రభుత్వం మల్లప్పురం, కోజీకోడ్, వయనాడ్, కసరగోడ్, కన్నూర్ జిల్లాలలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

