మొరంచ గ్రామంలో ప్రజలకు ‘వాటర్ బోట్లు, హెలికాఫ్టర్లు’
వరద నీటిలో పూర్తిగా చిక్కుకున్న భూపాల పల్లి జిల్లా మొరంచ గ్రామం నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మోటారు బోట్లను, హెలికాఫ్టర్లను, బస్సులను ఏర్పాటు చేశారు అధికార యంత్రాంగం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం పలుచోట్ల సహాయక చర్యలు చేపడుతోంది. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా,ఎం ఎల్ ఏ గండ్ర రమణా రెడ్డి,యెస్ పి,కరుణాకర్, మరియు,సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆర్మీ కి చెందిన రెండు హెలీకాఫ్టర్లను భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామానికి పంపిస్తున్నాం అని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ప్రకటించారు.

వరద ఉధృతికి భూపాల పల్లి- పరకాల జాతీయ రహదారిపై సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దానికి తోడు వరద పెరిగిపోవడంతో లారీలు కూడా మునిగిపోతున్నాయి. లారీ డ్రైవర్లు భయాందోళనలకు గురవుతున్నారు. వారు ఎలివేటెడ్ క్యాబిన్లలో సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు. ఇక్కడ గల మోరంచ వాగు కారణంగా భారీ వరద సంభవించింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నిర్వాసితులు సహాయక చర్యల కోసం ఇళ్ల పైకప్పులపై ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాంతంలో 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సూచనల మేరకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.