అనుమతులు లేకుండానే ఫ్లైఓవర్ కూల్చివేత?
గుంటూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెమ్మసాని తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల గుంటూరు నగరం అస్తవ్యస్తంగా మారిందని, నగరాన్ని ఆయన సర్వనాశనం చేశారని మండిపడ్డారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌ను కూల్చివేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. “అద్భుతమైన కోర్ సెంటర్‌ను సేతు బంధు పథకం కింద తొక్కేశారు. కనీసం కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా భూసేకరణ చేపట్టారు. విచిత్రమేమిటంటే, ఫ్లైఓవర్‌ను కూల్చివేసిన తర్వాత ఇప్పుడు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు” అని ఆయన ఎద్దేవా చేశారు. పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు నగరానికి జరుగుతున్న అన్యాయాలపై తాను ప్రశ్నిస్తుంటే, ఎదురుదాడి చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పినందుకు తనను మహిళల చేత తిట్టించారని, ఇది పెమ్మసాని అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. వ్యక్తిగత దూషణలకు దిగడం మానుకొని, ప్రజల ఇబ్బందులకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫ్లైఓవర్ కూల్చివేత వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య జటిలమైందని, సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారని అంబటి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఈ పరిణామాలన్నింటికీ ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టించడం సరికాదని హితవు పలికారు.

