ఢిల్లీ కాలుష్యం పై యుద్ధం ప్రకటించాలి
ఢిల్లీ వాయు కాలుష్యంపై రాజ్యసభ జీరో అవర్‌లో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని జాతీయ రాజకీయ, సామాజిక ప్రాధాన్యతాంశంగా తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాకుండా ఆరోగ్య, ఆర్థిక పరమైన ప్రభావాలను సృష్టించే అతివ్యాప్తి సమస్య అని అన్నారు. వాయు కాలుష్యంతో ప్రతి సంవత్సరం దేశం జీడీపీకి మూడు శాతం నష్టం వాటిల్లుతోందని, ప్రజలు వైద్య ఖర్చుల భారం మోస్తూ ఉత్పాదకత కోల్పోతున్నారని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతుండటం దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలుష్య నియంత్రణకు సమగ్ర పాలసీ రూపొందించి కఠిన చర్యలు అమలు చేయాలని, వ్యర్థాల నిర్వహణ, పవర్ ప్లాంట్ల నియంత్రణ, గాలి నాణ్యత మెరుగుదల, పరిశుభ్రమైన ఇంధనాల్లో పెట్టుబడులు పెంచాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు రియల్ టైమ్ డేటా ఆధారంగా చర్యలు తీసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని, ప్రతి ఏడుగురిలో ఒకరు అకాల మరణ ముప్పును ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత ఏడాది 17 వేల మంది వాయు కాలుష్యంతో మరణించారని, ప్రస్తుతం గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నదని తెలిపారు. వాహన కాలుష్యం, పంట అవశిష్టాల దహనం, నిర్మాణ కార్యకలాపాలే ప్రధాన కారణాలని వివరించారు.
విశాఖపట్నంలో కూడా పీఎం-10 స్థాయిలు గత ఏడు ఏళ్లలో 32.9 శాతం పెరిగాయని అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఏపీకి 129.4 కోట్లు కేటాయించగా, అందులో 39 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బాధాకరమని అన్నారు. కింది స్థాయి పర్యవేక్షణలోపం, విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యంతో కాలుష్యం పెరుగుతోందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

