ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం..
సంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇరుపార్టీల నేతల మధ్య పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్‌ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి.
ఆయనకు నిధులెక్కడివి? బీఆర్ఎస్ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక వంద కోట్ల రూపాయలు సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్‌సైట్‌లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు వంద కోట్లు ఎక్కడి నుండి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో రఘునందన్ ప్రశ్నించారు.

