కాంగ్రెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రుల మధ్య విభేదాలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార సమయంలో జరిగిన ఒక సంఘటన ఈ వివాదానికి కారణమైంది. ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ పాల్గొన్నారు. సమావేశానికి అడ్లూరి లక్ష్మణ్ కాస్త ఆలస్యంగా చేరుకోవడంతో, ఆయన రాకముందు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో రికార్డ్ కావడం, ఆ తర్వాత ఆ వీడియో బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది.
ఆ వీడియోలో ఉన్న వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తాను మాదిగ ఉపవర్గానికి చెందిన వాడిననే కారణంతో సహచర మంత్రులు అవమానకరంగా ప్రవర్తించారని అన్నారు. ‘‘తక్కువ జాతి వాడినని అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?’’ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో విడుదల చేసి, పొన్నం ప్రభాకర్‌పై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జరిగిన పొరపాటును ఒప్పుకుని క్షమాపణ చెప్తే గౌరవంగా ఉంటుందని , మాదిగలు అంటే అంత చిన్న చూపు ఎందుకని , సహచర మంత్రిని అలా అవమానిస్తే చూస్తూ ఊరుకోమంటారా అని అడ్లూరి ప్రశ్నించారు.గడ్డం వివేక్ పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘‘నేను పక్కన కూర్చుంటే ఆయన ఓర్చుకోలేరు. పొన్నంలా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు. నా దగ్గర డబ్బులు లేవు, నేను కాంగ్రెస్ జెండా నమ్ముకున్న వాడిని. మాదిగ వాడినని నన్ను చిన్న చూపు చూడటం సరికాదని అన్నారు. తన సామాజిక వర్గంపై వివక్ష చూపడం బాధాకరమని పేర్కొంటూ, త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మీనాక్షి నటరాజన్లను కలుస్తానని తెలిపారు.
ఈ వివాదం బయటకు రావడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే రంగంలోకి దిగి ఇద్దరికి బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసి మంత్రులిద్దరిని సంయమనం పాటించాలని కోరారు . అంతర్గత విభేదాలు పార్టీ కి మంచివి కావని హెచ్చరించారు . ఇద్దరికీ నచ్చజెప్పి సమస్యను పరిష్కరించారు . మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపుకార్డు వేశారు .