బీఆర్ఎస్‌తో కేసీఆర్‌కు వీఆర్ఎస్సేనా?
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. గతంలో ఆయా రాష్ట్రాల్లో పట్టు సంపాదించి.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చాలా మంది నాయకులు భావించేవారు. ఒక్కో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం, లోక్ సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా.. ఆయా పార్టీలు జాతీయ పార్టీలుగా రూపాంతరం చెందేవి. కానీ కేసీఆర్ వాటి వేటినీ పట్టించుకోకుండా… జాతీయ పార్టీని స్థాపించాలని నిర్ణయానికి వచ్చారు. ఇన్నాళ్లుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత్ రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. టీఆర్ఎస్ కేవలం తెలంగాణకు మాత్రమే సంబంధించినది కావడంతో.. ఆయన జాతీయ ఆలోచనలకు అనుగుణంగా తాజాగా కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. పార్టీ రంగు, జెండా, గుర్తు అదే ఉంటుంది కానీ.. పేరు మాత్రం మారుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయ్.

మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు రానున్న తరుణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నదానిపై ప్రధాన రాజకీయపక్షాలు మల్లగుల్లాలుపడుతున్నాయ్. కేసీఆర్ జాతీయ పార్టీ అంటే అది పేరు కోసమేనా.. లేదంటే జాతీయ స్థాయిలో రాజకీయాన్ని మార్చేటందుకా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో ఉన్న పార్లమెంట్ స్థానాలు కేవలం 17. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ స్థానాలున్నాయ్. విభజన తర్వాత తెలంగాణ పరిధి తగ్గింది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ చేస్తున్న హంగామాపై మేటి నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్. కాంగ్రెస్ పార్టీతోనూ, బీజేపీతోనూ సమానదూరమంటూ కేసీఆర్ చేస్తున్న ప్రకటనపైనా కొంత అస్పష్టత కన్పిస్తోంది. తెలంగాణ ఇస్తే చాలు.. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం చేస్తానంటూ గతంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అన్నది లేకుండా చేశారు కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మజ్లిస్ అంటే నమ్మాల్సిందే. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ అంటూ విపక్షాలన్నింటినీ టీఆర్ఎస్ పార్టీలో ఐక్యం చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాలంటూ జంగ్ సైరన్ చేస్తున్నారు.

జాతీయ రాజకీయాల ద్వారా తెలంగాణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను దేశమంతటా తీసుకురావాలంటున్నారు కేసీఆర్. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తూ.. చలికాచుకుంటుందంటూ విమర్శిస్తున్న కేసీఆర్… ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పనైపోయిందంటున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోషించాల్సిన రోల్‌లోకి బీజేపీ వచ్చేయడంతో ఆయనలో ఆందోళన ఎక్కువవుతోంది. కేసీఆర్‌లో రోజు రోజుకు అసహనం పెరుగుతోంది. హుజూరాబాద్ ఉపఎన్నికకు ముందు జరిగిన దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణ కొత్త రాజకీయాన్ని స్వాగతిస్తోందన్న సంకేతాలిచ్చాయ్. ఆ కొద్ది రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఎగ్జిట్ తర్వాత మొత్తం సినారియో మారిపోయింది. కేసీఆర్ ఏం చేసినా అడిగేవారండరు.. తెలంగాణలో ఆయన చెప్పిందే వేదం… చేసిందే శాసనమనుకుంటున్న తరుణంలో.. తనపై కక్షగట్టిన కేసీఆర్‌కు హుజూరాబాద్‌లో కర్రుగాల్చి వాత పెట్టారు రాజేందర్. దీంతో తెలంగాణలో ప్రయత్నిస్తే పోయేదేం లేదన్న సిద్దాంతం బీజేపీ ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీపై మొదట్నుంచి అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో మొత్తం పరిణామాలు మారిపోయాయ్. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం, స్పీకర్ ఆమోదించడం, ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయ్. ఈ తరుణంలో కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ చేస్తున్న కొత్త పోకడలు తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగిస్తున్నాయ్. తెలంగాణలో తప్పించి ఇక, దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా కేసీఆర్‌కు సానుకూలత లేదు. ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసిన దాఖలాలు లేవు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీని దేశమంతటా విస్తరించాలనుకున్న కేజ్రీవాల్.. ఆరు నెలల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం గురించి ప్రజల్లో ఆలోచన కలిగించారు. కానీ కేసీఆర్ అలాంటివేవీ కూడా చేసిన దాఖలాలు లేవు. బీహార్‌లో గాల్వాన్ మృతులకు చెక్కుల పంపిణి, పంజాబ్ రైతులకు పరిహారం తప్పించి… ఇతర రాష్ట్రాల రాజకీయాలపై కేసీఆర్ చేసిందేమీ లేదు. కొందరు నేతలను మిత్రులుగా మార్చుకోవడం తప్ప ఒరిగిందేముంది? తెలంగాణలో రాజకీయం తన గుప్పెట్లో ఉందన్న నిర్ణయానికి వచ్చి కేసీఆర్ ఇలా చేస్తున్నారా.. లేదంటే తెలంగాణ బిడ్డ.. జాతీయ రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తాడన్న భావనతో స్థానికంగా అడ్వాంటేజ్ కలుగుతుందని చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.

కేసీఆర్ చెబుతున్నట్టుగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చాన్నాళ్ల నుంచి అమలవుతున్నాయ్. కరువు నేలలో వ్యవసాయం కోసం గుజారాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో ఇలాంటి విధానాలను ఎప్పట్నుంచో ఉన్నాయ్. కేసీఆర్ చెబుతున్నట్టుగా సాగు ప్రాజెక్టులు నిర్మాణం దేశ వ్యాప్తంగా ఎప్పట్నుంచో సాగుతోంది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి పథకాలు పేరు మార్పుతో పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయ్. కేసీఆర్ కిట్ లాంటి స్కీమ్స్ దేశంలోని చాలా రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అమలువుతున్నాయ్. రైతు బంధు అంటూ కేసీఆర్ ఇస్తున్న పథకంలో మంచి, చెడు పరిశీలించే.. పేద రైతులకు కేంద్రం దేశ వ్యాప్తంగా పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇలా కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పేరు మార్పులతో ఉన్నాయ్. కానీ కేసీఆర్ మాత్రం తాము చేస్తున్నట్టుగా బీజేపీ పాలిత రాష్ట్రాలుగానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగానీ, ఇతర రాష్ట్రాలు గానీ అమలు చేయడం లేదని మాత్రం పదేపదే చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయాన్ని గంపగుత్తగా లభిస్తున్న తరుణంలో.. అనుకున్నట్టుగా పథకాలు చేసేందుకు నగదు లభ్యమయ్యింది. కానీ ఆ అవకాశాన్ని కేసీఆర్ సక్రమంగా ఉపయోగించలేదన్న అభిప్రాయం కూడా నిపుణుల నుంచి వ్యక్తమయ్యింది. కేసీఆర్ పథకాలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయ్. తెలంగాణ బడ్జెట్‌కు వెన్నుదన్నుగా నిలిస్తున్న హైదరాబాద్ ఆదాయాన్ని.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో వినియోగించలేదని, హైదరాబాద్ భూములు అమ్మి సైతం ఇష్టానుసారంగా ఖర్చు చేశారన్న ఆరోపణలు వచ్చాయ్.

ఇక లిక్కర్ ద్వారా వస్తున్న ఆదాయం చూసేందుకు బాగానే ఉన్నా.. సమాజంలో వాటి వల్ల జరుగుతున్న అనార్థాలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాక కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సర్కారు మిగతా వాళ్లకు భిన్నంగా చేసేందేముందన్న అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ధనిక రైతులకు రైతుబంధు ఇవ్వడం కోసం జాతీయ పార్టీ పెడుతున్నారా.. దేశ వ్యాప్తంగా వరి వేయొద్దని చెప్పేందుకు జాతీయ పార్టీ పెడుతున్నారా.. కాళేశ్వరంలా ప్రాజెక్టులు ముంచేందుకు జాతీయ పార్టీ పెడుతున్నారా అన్న విమర్శలు కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయ్. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన దళితబంధు పథకం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక మునుగోడు ఎన్నికల సందర్భంగా గిరిజన బంధు అంటూ ప్రకటించారు కేసీఆర్.. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, వ్యయం రెండూ లెక్కలు దగ్గర పెట్టుకొని.. తాను ఎన్నికల్లో ప్రయోజనాలు పొందడానికి మాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయ్. ఓవైపు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా.. ఉద్యోగులకు నెల పూర్తయ్యాక కూడా జీతాలివ్వని దుస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయ్. పరిస్థితులు ఇలా ఉంటే… కేసీఆర్ ఏం చెప్పి… జాతీయ రాజకీయాలు చేస్తారన్న చర్చ సాగుతోంది.

అసలు కేసీఆర్ జాతీయ పార్టీ అవసరం దేశానికి ఏముంది? గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెబుతున్న పొరుగు రాష్ట్రం మాజీ సీఎం చంద్రబాబునాయుడు.. ఏపీ చూసుకుంటే చాలనుకుంటున్నారు. గతంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న సమయంలో ఎన్టీఆర్ జాతీయ పార్టీ ఆలోచనలు చేసి.. చివరికి ఏమీ సాధించలేకపోయారు. ఇక తమిళనాడులో ఎంజేఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలనుకున్నా.. పరిస్థితులు అనుకూలించక ఆయా రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి ఉన్నా.. జాతీయ రాజకీయాలపై ఎంతో గందరగోళంగా ఉంది. గతంలో చక్రం తిప్పిన నితీష్ లాంటి నేతలు జాతీయస్థాయిలో ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జనపడుతున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి వల్ల ఒరిగేదేమీ ఉండదన్న వర్షన్ బలంగా విన్పిస్తోంది. తెలంగాణలో వరుసగా రెండు టర్మ్‌లు అధికారాన్ని అనుభవిస్తోన్న కేసీఆర్… మూడో టర్మ్ గెలవడం కోసం జాతీయ రాజకీయాలన్న పాట పాడతున్నారా అన్న అనుమానం కూడా ఉంది. తెలంగాణ బయట ఒక్క రాష్ట్రంలో కూడా ప్రభావం చూపించే పరిస్థితిలో లేని కేసీఆర్… జాతీయ రాజకీయాల ప్రకటనలతో వీఆర్ఎస్ తీసుకోక తప్పదని రాజకీయ ప్రత్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు.