NationalNews

నవంబర్ 12న హిమాచల్‌ ఎన్నికలు, డిసెంబర్ 8న ఫలితాలు

హిమాచల్ ప్రదేశ్ ప్రజలు నవంబర్ 12న కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఇవాళే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని భావించినప్పటికీ… ఆ వివరాలు మాత్రం ఈసీ వెల్లడించలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను కూడా త్వరలోనే నిర్వహిస్తామన్నారు. సాంప్రదాయం నుంచి పక్కకు జరగడం లేదన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. వాతావరణం వ్యాత్యాసం వల్ల రెండు రాష్ట్రాల ఎన్నికలను వేర్వురుగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో 35 మెజారిటీ మార్క్. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 8న ముగుస్తుంది. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం 26 రోజుల తర్వాత ఫిబ్రవరి 18న ముగుస్తుంది.

2017లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకోగా.. ఇండిపెండెంట్లు రెండు, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నారు. ఓట్ షేర్ ను పరిశీలిస్తే… 48.79 శాతం బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్ 41.68 శాతం, ఇతరులు 6.34 శాతం ఓట్లు పొందారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. హిమాలయ రాష్ట్రంలోకి ప్రవేశించి ద్విముఖ పోటీని ముక్కోణపు పోరుగా మార్చాలని భావిస్తోంది. 1.86 లక్షల మంది మొదటి సారి ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన 1.22 లక్షల మంది, 100 ఏళ్లు పైబడిన 1,100 మందితో సహా మొత్తం ఓటర్లు 55 లక్షల మందికి పైగా ఉన్నారు. ఒకే ఫేజ్‌లో హిమాచల్ ఎన్నికలు జరుగుతాయి. 17 అక్టోబర్‌న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ 25 అక్టోబర్. 27 వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 29 తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 12న హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 8న ఫలితాలు విడుదలవుతాయి. ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 10తో ముగుస్తుంది.