కేసీఆర్‌కు ఓటుతో రాజకీయ గుణపాఠం చెప్పండి ఓటరులారా..
భీమారం: పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు నుంచే సీఎం కేసీఆర్‌కు ఓటుతో రాజకీయ గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి అన్నారు. గురువారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే హనుమకొండతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గంలోని గుండ్ల సింగారంలో ప్రజాదీవెన యాత్ర నిర్వహించారు. ఈ సభల్లో విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరిట కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట ప్రకటనలు జారీచేసి తీరా పరీక్షల సమయంలో పేపర్ లీక్ కావడం వంటి చర్యలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు దండుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ది మాఫియా వంశమని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన ఎమ్మెల్సీ కవితను వదిలిపెట్టి మిగతావారిని అరెస్టు చేయడం వెనుక మర్మమేమిటో ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజల మధ్య నిజాయితీగా ఉండే నాయిని రాజేందర్ రెడ్డి కావాలా? పశ్చిమ నియోజకవర్గంలో దోపిడీ చేసే ఎమ్మెల్యే కావాలో మీరే నిర్ణయించుకోండి ఆపై మంచి వ్యక్తికి మీ ఓటు వేయండి అని విజయశాంతి కోరారు.