ఒట్టేసి చెప్పు.. ఓటేస్తానని..
మునుగోడులో దేవుడినీ వదలని పార్టీలు
దేవుడి సెంటిమెంట్‌తో ఓటర్లకు లీడర్ల గాలం
యాదాద్రి దర్శనం చేయించిన ఓ ఎమ్మెల్యే
స్వామి ఆరగింపు సేవ ఆపి స్పెషల్ దర్శనం
మునుగోడులో విజయం కోసం రాజకీయ పార్టీలు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. దసరా సందర్భంగా ముక్క, మద్యం.. దీపావళి సందర్భంగా టపాసులు, స్వీట్లు.. ఓటుకు నోటు.. భారీ బహుమానాలు.. అయినా ఓటర్లపై నమ్మకం కుదరని రాజకీయ నాయకులు కొత్తగా దేవుడి సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు. తమకే ఓటేస్తామని దేవుడి ముందు ఒట్టేయించుకుంటున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే మునుగోడు ఓటర్లకు యాదాద్రి లక్ష్మి నర్సింహ స్వామి ప్రత్యేక దర్శనం చేయించారు. దేవుడి సెంటిమెంట్‌తో తమ వైపునకు తిప్పుకునేందుకు స్కెచ్ వేశారు.

మునుగోడు నియోజక వర్గంలోని దండు మల్కాపురం గ్రామానికి చెందిన దాదాపు 1000 మంది ఓటర్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం 15 బస్సుల్లో యాదగిరి గుట్టకు తీసుకెళ్లారు. బస్సుల్లోకి ఎక్కిన ఓటర్లతో జీవన్ రెడ్డి ఫొటోలు కూడా దిగారు. ఆ బస్సులకు 9999 ఫార్చునర్ కారు ఎస్కార్ట్‌గా వెళ్లింది. నిబంధనల ప్రకారం యాదగిరి గుట్టకు వచ్చిన భక్తులు ఆర్టీసీ స్థానికంగా ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సుల్లోనే కొండపైకి వెళ్లాలి. కానీ.. అధికారులు ఓటర్లు వచ్చిన బస్సులను నిబంధనలకు వ్యతిరేకంగా నేరుగా కొండపైకి అనుమతించడం విశేషం. వారికి ఎమ్మెల్యే 150 రూపాయల వీఐపీ లైన్‌లో తీసుకెళ్లి మరీ స్పెషల్ దర్శనం చేయించారు. దర్శనం తర్వాత 40 మేకలను కోసి గుట్టపైనే విందు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

అయితే.. దండు మల్కాపురం గ్రామస్తులు గుట్టపైకి 12 గంటలకు చేరుకున్నారు. ఆ సమయంలో స్వామి వారికి ఆరగింపు సేవ జరగాల్సి ఉంది. కానీ.. ఎమ్మెల్యే ఆదేశంతో అధికారులు స్వామి వారి ఆరగింపు సేవను నిలిపివేసి దండు మల్కాపురం గ్రామస్తులకు కుటుంబ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించారు. రాజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసం ఆలయ నిబంధనలను ఉల్లంఘించిన అధికారుల తీరును భక్తులు తప్పుబట్టారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు నాయకులు దేవుడిని సైతం వదిలి పెట్టరా..? అని ప్రశ్నిస్తున్నారు.

