వివేక హత్య కేసులో సీబీఐకి ముగిసిన గడువు
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన దర్యాప్తు గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి. సిబిఐ తర్వాత తీసుకునే నిర్ణయం పట్ల ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దర్యాప్తు పూర్తయిందా, లేక గడవు కోరుకుంటుందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కడప కేంద్రంగా వివేకాహత్య కేసులో సిబిఐ దర్యాప్తు నత్తనడకన నడుస్తోందంటూ సునిత పిటీషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించి ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని గతంలో ఆదేశించింది. అయితే నిర్ణీత గడువులోగా దర్యాప్తు కొలిక్కి రానందున సిబిఐ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు జూన్ 30వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీంతో సిబిఐ కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారంతో పూర్తయింది. వివిధ సందర్భాల్లో పలు పిటిషన్లకు సంబంధించి విచారణ సందర్భంగా అవసరాన్ని బట్టి దర్యాప్తు గడువును పొడిగిస్తామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే దీనిపై ఇప్పటివరకు సిబిఐ ఎలాంటి విజ్ఞప్తి చేయనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితులు రిమాండ్ ముగియడంతో చంచలగూడా జైల్లో ఉన్న నిందితులను అధికారులు శుక్రవారం సిబిఐ కోర్టులో హాజరు పరిచారు. గతంలో అరెస్టయి జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి లను న్యాయమూర్తి ఎదుట హాజరపరచగా జులై 14 వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితులను తిరిగి చంచల్‌గూడా జైలుకు తరలించారు.