News

భావితరాలకు స్ఫూర్తినందించిన విశ్వేశ్వరయ్య

( నేడు ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం)

సమాజ గమనంలో కీలకమైన బాధ్యతను ఇంజనీరింగ్ రంగం పోషిస్తుంది. సెప్టెంబర్ 15 భారతీయ ఇంజనీర్లందరికి పండగ రోజు. ప్రఖ్యాత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఈ రోజునే. ఇంజనీరింగ్ రంగానికి వన్నెతెచ్చిన ఆయన జయంతి రోజునే దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ డే గా జరుపుకుంటారు. ఇంజనీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించిన వారిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఇంజనీరింగ్ ద్వారా మన దేశ ఖ్యాతిని ఆయన నలుదీశల చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు.

1861 వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన కర్ణాటకలోని బిక్ బల్లాపూర్ లోని మద్దెనహళ్లి అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన పూర్వీకులు మాత్రం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. అప్పటి ప్రిన్సిపల్ మైసూరు రాజ్యపు దివాన్ రంగాచార్యుల సహాయ సహకారాలతో ప్రభుత్వ ఉపకార వేతనంపై పూణేలోని ఇంజనీరింగ్ కాలేజీలో విశ్వేశ్వరయ్య విద్యనభ్యసించారు. అప్పటి బొంబాయి రాష్ట్రంలో సిడబ్ల్యూడి శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఆయన నియమితులయ్యారు. దాదాపు 70 ఏళ్లకు పైగా నిరంతరం శ్రమించి దేశంలోని దాదాపు అన్ని ముఖ్య నగరాలకు రక్షిత మంచి నీటి సరఫరా, మురుగునీటి నిర్మూలన, వరద నివారణకు పథకాలు మొత్తం ఆయన కృషి ఫలితంగానే పూర్తి అయ్యాయి.

1918 నాటికి దేశంలో కెల్లా అతిపెద్దదైన కృష్ణరాజు సాగరం జలాశయం కావేరి నదిపై నిర్మించారు. మైసూర్ సంస్థానంలో లక్షలాది ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించి కోలారు బంగారు గనులకు మైసూరు బెంగళూరు నగరాలతో పాటు అనేక గ్రామాలకు విద్యుత్ కొరత తీర్చి మైసూరు రాజ్యపు ఆర్థిక స్వరూపాన్ని మార్చివేసి సమగ్ర అభివృద్ధికి దోహదకారి అయి ఆ రాజ్యానికి జీవనాడి అయింది. ఇది ఇరిగేషన్ ఇంజనీరుగా విశ్వేశ్వరయ్య సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. పూనే, మైసూరు, హైదరాబాదు మొదలైన నగరాలకు నవీన పద్ధతులలో డ్రైనేజీ పథకాలు వీరి సూచనల మేరకే పూర్తి చేశారు. అప్పటి మైసూరు మహారాజు మైసూరు సంస్థాన సమగ్ర అభివృద్ధికై చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతను స్వీకరించి తమ రాజ్య ప్రజలకు తమ మేధాశక్తి సత్ఫలితాలను పంచి ఇవ్వవలసిందిగా ఆనాడు విశ్వేశ్వరయ్యను కోరారు. అందుకు విశ్వేశ్వరయ్య తమ జీవిత ఆశయాలైన పరిశ్రమల స్థాపన విద్యాభివృద్ధి ముఖ్యంగా సాంకేతిక విద్యావ్యాప్తి మొదలైన అన్ని కార్యక్రమాలకు మహారాజు సహకరించి ఆమోదముద్ర వేయాలని కోరి ఆ షరతులపై చీఫ్ ఇంజనీర్ గా 1909లో బాధ్యతను స్వీకరించారు.

102 వ ఏట తుది శ్వాస విడిచే వరకు నిస్వార్థ చింతనతో దేశానికి సేవ చేసిన ధన్యజీవి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇంజనీరింగ్ భాగంలో చేసిన సేవలను గుర్తిస్తూ 1955వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు భారతరత్న పురస్కారం లభించింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఈ అత్యున్నతమైన పురస్కారం 1955లో ఆయనకు దక్కింది. భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టర్లేట్లతో సత్కరించాయి. విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 14వ తేదీన తుది శ్వాస విడిచారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి ఇంజనీరింగ్ డే సందర్భంగా ఆయనను ఒకసారి స్మరించుకుందాం.