అరకు, అనకాపల్లి ఎంపీలు అసెంబ్లీకి? వైఎస్ జగన్ గ్రౌండ్ వర్క్ వర్కౌటయ్యేనా?
ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేను ఎంపీలుగా పంపేందుకు అడుగులు వేస్తున్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి ఇద్దరు మహిళా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది. త్వరలో విడుదల అయ్యే వైసీపీ రెండో జాబితాలో ఇద్దరు ఎంపీల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. అనకాపల్లి నుంచి 2019లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన భీశెట్టి సత్యవతిని ఈసారి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ యోచిస్తున్నారు. బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, విద్యాధికురాలు, వైద్య వృత్తిలో దశాబ్దాలుగా ఉన్నారన్న లెక్కలు పార్టీ వేసుకుంటోంది. స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారని… ఎంపీగా ఆమె పనితీరు పట్ల కూడా ఎలాంటి విమర్శలు లేవని… ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

అనకాపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి గుడివాడ అమర్నాథ్, చోడవరం నుంచి ఈసారి పోటీ చేయిస్తారని అంటున్నారు. దాంతో అనకాపల్లి సీటుకు ఎంపీ సత్యవతిని సిద్ధం చేశారు అని అంటున్నారు. మంత్రి గుడివాడ సైతం ఆమె అభ్యర్ధిత్వం పట్ల సుముఖంగా ఉన్నారంటున్నారు. ఇక అల్లూరి జిల్లా అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని పాడేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని అంటున్నారు. మాధవి ఎంపీగా రెండున్నర లక్షలపై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఆమె కూడా మంచి పనితీరు కనబరచారు. అయితే ఈసారి ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అధినాయకత్వం నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి పనితీరు పట్ల సర్వే నివేదికలు వ్యతిరేకంగా రావడంతో పాటు వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన గిడ్డి ఈశ్వరి నుంచి గట్టి సవాల్ ఎదురవుతోందని, ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలని వైసీపీ నిర్ణయించింది.

గొడ్డేటి మాధవిని పోటీలోకి దించడం ద్వారా పాడేరు అసెంబ్లీ సీటుని మరోసారి తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ చూస్తోందంటున్నారు. ఇక భాగ్యలక్ష్మికి టికెట్ దక్కదనే అంటున్నారు. అరకు ఎంపీ సీటుని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరకు ఇస్తారని తెలుస్తొంది. ఈ సమీకరణలతో భాగ్యలక్ష్మిని ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చి పక్కన పెడతారంటున్నారు.

